ఏపీలో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడే అవకాశం

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ జిల్లా భీమిలి, యలమంచిలి, తదితర ప్రాంతాలలో కొన్ని గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామం వద్ద

Update: 2019-10-19 11:02 GMT

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ జిల్లా భీమిలి, యలమంచిలి, తదితర ప్రాంతాలలో కొన్ని గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామం వద్ద కాజ్ వే మునగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో పలు లోతట్టు ప్రాంతాలు, రహదారుల జలమయం అయ్యాయి. డ్రైనేజీ మురుగునీరు రోడ్లపై పొంగి పొర్లింది. పలు మార్గాలు కంపు కొడుతున్నాయి. ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముమ్మిడివరం కమిషనర్‌ రామ అప్పల నాయుడు.. ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. గుంటూరు జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

జిల్లాలోని రేపల్లె, పెదకూరపాడు, సత్తెనపల్లి, గురజాల, వినుకొండలలో కుండపోత వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు ఎస్టీకాలనీలోకి భారీగా వరద నీరు చేరింది, దీంతో ప్రజలు ఇళ్లలోనుంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కాలనీలో పర్యటించారు. ప్రస్తుతానికి ప్రభుత్వ పాఠశాలలో భోజన వసతి ఏర్పాట్లు చేశారు. ఇదిలావుంటే ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని.. వర్షంతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 

Tags:    

Similar News