Kidnap Case: మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ.. స్టే ఇచ్చేందుకు నిరాకరణ!
Kidnap Case: మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) ఛాన్సలర్, ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
కిడ్నాప్ కేసు: మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ.. స్టే ఇచ్చేందుకు నిరాకరణ!
Kidnap Case: మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) ఛాన్సలర్, ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో తనను అరెస్టు చేయకుండా స్టే ఇవ్వాలని, రక్షణ కల్పించాలని ఆయన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు
ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసులు కీలక ఆధారాలను కోర్టు ముందు ఉంచారు. కిడ్నాప్ ఘటన జరగడానికి ముందు, ఆ తర్వాత యూనివర్సిటీ పీఆర్వో సతీష్‌తో మోహన్ బాబు నిరంతరం టచ్‌లో ఉన్నారని పోలీసులు ధర్మాసనానికి వివరించారు. వారిద్దరి మధ్య ఫోన్ కాల్స్ మాత్రమే కాకుండా, పలు మెసేజ్‌లు కూడా మార్పిడి జరిగినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, మోహన్ బాబుకు మధ్యంతర ఊరట ఇచ్చేందుకు నిరాకరించారు.
మార్చి 3కి విచారణ వాయిదా
ఈ వ్యవహారంలో ప్రధాన వ్యాజ్యంపై పూర్తిస్థాయిలో లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. దీంతో తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. తాజా తీర్పుతో ఈ కేసులో మోహన్ బాబుకు అరెస్ట్ భయం పట్టుకుంది. పోలీసులు ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.