Simhachalam: గత అనుభవాలతో అప్రమత్తం.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

Simhachalam: సింహాచలం చందనోత్సవ ఏర్పాట్లపై విశాఖ కలెక్టర్ ఎం. అభిశిక్త్ కిషోర్ సమీక్ష నిర్వహించారు.

Update: 2026-04-06 15:12 GMT

Simhachalam: గత అనుభవాలతో అప్రమత్తం.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

Simhachalam: గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకొని అలాంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం కాకుండా శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామివారి చంద‌నోత్స‌వ వేడుక‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించాల‌ని సంబంధిత అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. సోమ‌వారం సాయంత్రం క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో కీల‌క శాఖ‌ల అధికారుల‌తో స‌మావేశ‌మైన ఆయ‌న ఈ మేర‌కు సూచ‌న‌లు చేశారు. చందనోత్సవ క్ర‌తువును శాంతియుతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖ‌లు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.

గ‌తంలో జ‌రిగిన పొర‌పాట్లు మ‌రలా జ‌ర‌గడానికి వీల్లేద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వం అంద‌జేసిన ఎస్.వో.పి. (స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రొసీజ‌ర్)కు లోబ‌డి అధికారులంతా ఏర్పాట్లు చేయాల‌ని, నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని, అంకిత‌భావంతో ప‌ని చేయాల‌ని పేర్కొన్నారు. స‌మీక్షలో భాగంగా ముందుగా గ‌త స‌మావేశాల్లో చ‌ర్చంచిన అంశాలు, చంద‌నోత్స‌వ వేడుక‌లో నిర్వ‌హించే సంప్ర‌దాయ ఘ‌ట్టాల‌పై దేవ‌స్థానం ఈవో జె. వెంక‌ట‌రావు, ఆల‌య పండితులు క‌లెక్ట‌ర్ కు వివ‌రించారు.

అన్ని అంశాల‌ను కూలంక‌షంగా విన్న క‌లెక్ట‌ర్ అధికారుల‌కు స్ప‌ష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉత్స‌వ నిర్వ‌హ‌ణ‌లో అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, ఆయా శాఖ‌ల‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను అత్యంత బాధ్య‌త‌తో నిర్వ‌ర్తించాల‌ని సూచించారు. భ‌ద్రతా ఏర్పాట్లను పోలీస్ శాఖ ప‌ర్య‌వేక్షించాల‌ని, బస్సు సర్వీసుల విష‌యంలో ఏపీఎస్ ఆర్టీసీ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. ఎస్.వో.పి. మేర‌కు టిక్కెట్ల‌ను ముద్రించాల‌ని, రూ.1500, 1000 టిక్కెట్ల‌పై పిక‌ప్, డ్రాపింగ్ పాయింట్ వివ‌రాల‌ను తెలిపాల‌ని సూచించారు. ప‌రిమిత సంఖ్య‌లో వెహిక‌ల్ పాసులు జారీ చేయాల‌న్నారు.

తాగునీటి స‌దుపాయం, పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌, మ‌రుగుదొడ్ల ఏర్పాటు, మెడిక‌ల్ క్యాంపుల నిర్వ‌హ‌ణ‌లో ప్రత్యేక శ్ర‌ద్ధ వ‌హించాల‌ని చెప్పారు. ఆధునిక స‌దుపాయాలు క‌లిగిన అంబులెన్స్ ల‌ను సిద్ధంగా ఉంచుకోవాల‌న్నారు. అగ్నిమాప‌క శ‌క‌టాల‌ను అందుబాటులో ఉంచాల‌ని సూచించారు. విద్యుత్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయాలు క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. మ‌ద్యం దుకాణాల‌ను తాత్కాలింగా మూసివేసే విష‌యంలో గ‌త నియ‌మాల‌ను పాటించాల‌ని చెప్పారు. పబ్లిక్ అడ్ర‌స్ సిస్ట్ం ఏర్పాటు, ఇత‌ర మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌లో ఆయా శాఖ‌లు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.

అన్ని ప్ర‌క్రియ‌ల‌ను ఏప్రిల్ 17 నాటికి పూర్తి చేయాల‌ని ఆదేశించారు. దాత‌లు పెట్టే ఫుడ్ కౌంట‌ర్ల‌ను ఫుడ్ సేఫ్టీ అధికారుల సాయంతో త‌నిఖీ చేయాల‌ని, ఆహార ప‌దార్థాల నాణ్య‌త‌ను ప‌రిశీలించాల‌ని సూచించారు. స‌మావేశంలో డీఆర్వో ఎం. విశ్వేశ్వ‌ర‌నాయుడు, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, జీవీఎంసీ సీఎం న‌రేశ్, ఆర్టీసీ ఆర్ఎం అప్ప‌ల‌నాయుడు, ఈపీడీసీఎల్ ఎస్.ఈ. శ్యాంబాబు, డీఎంహెచ్వో పి. జ‌గదీశ్వ‌ర‌రావు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News