Rajole: రాజోలులో సాగునీటి రంగానికి మహర్దశ.. ఎమ్మెల్యే సమీక్ష
Razole: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శివకోడు లాకుల వద్ద 'నీటి భద్రత - సాగు నీటి సంఘాల బాధ్యత' 100 రోజుల కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.
Rajole: రాజోలులో సాగునీటి రంగానికి మహర్దశ.. ఎమ్మెల్యే సమీక్ష
Razole: రాజోలు నియోజకవర్గంలో శివకోడు లాకుల వద్ద శాసన సభ్యులు దేవ వరప్రసాద్ సంబంధిత శాఖల అధికారులు మరియు సాగు నీటి సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించి “నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత” పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా చెరువులను పునరుద్ధరించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, చెరువులను సమీప జలవనరులతో అనుసంధానం చేయడం, కాలువల ద్వారా సాగునీటి సరఫరాను మెరుగుపరచడం, డ్రైన్లు మరియు ఫీడర్ ఛానళ్లను శుభ్రపరచడం వంటి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తద్వారా భూగర్భ జలాల పెంపు మరియు పచ్చదనం పెంపు కూడా సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ఏప్రిల్ 6 నుండి జులై 15, 2026 వరకు 100 రోజులపాటు నాలుగు దశల్లో అమలు చేయబడుతుందని తెలిపారు. మొదటి దశలో పనుల గుర్తింపు మరియు కార్యాచరణ ప్రణాళిక, రెండవ దశలో నిధుల మంజూరు, మూడవ దశలో పనుల అమలు, చివరి దశలో రిపోర్టింగ్ మరియు డాక్యుమెంటేషన్ జరుగుతాయని వివరించారు. పనుల వివరాలు మరియు జియోట్యాగింగ్ ఫోటోలు నమోదు చేయడానికి ప్రత్యేక యాప్ కూడా రూపొందించబడినట్లు చెప్పారు. అలాగే ఈ కార్యక్రమాన్ని జల శక్తి అభియాన్ వంటి కేంద్ర పథకాలతో అనుసంధానించి నిధులు సమకూర్చనున్నట్లు తెలిపారు.
రాజోలు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య సమస్యలపై కూడా ఎమ్మెల్యే అధికారులతో చర్చించారు. ముఖ్యంగా శంకరగుప్తం డ్రెయిన్ సమస్య, సముద్రపు పోటు కారణంగా లోపలికి వచ్చే నీరు తిరిగి బయటకు వెళ్లకపోవడం వల్ల సంవత్సరాలుగా ముంపు పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. దీనికి పరిష్కారంగా డ్రెయిన్‌లో టెక్నికల్ విశ్లేషణ చేసి, అవసరమైన చోట్ల అవుట్ ఫాల్స్ స్లూయిస్లు నిర్మించడం, పాత వాటిని మరమ్మతు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే చెరువులను పునరుద్ధరించి వ్యవసాయానికి నీటి అందుబాటు పెంచడం, అవసరమైన ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయడం ద్వారా సుమారు వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. గతంలో ఖర్చు చేసిన ప్రాజెక్టులను పునరుద్ధరించి రైతులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాగు నీటి సంఘాల అధ్యక్షులు, సంబంధిత అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.