ఎస్వీబీసీ ఛైర్మెన్‌ పదవికి పృథ్వీ రాజీనామా

Update: 2020-01-12 13:30 GMT
Prudhvi File Photo

ఎస్వీబీసీ ఛైర్మెన్‌ పృథ్వీరాజ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆడియో టేపుల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న టీటీడీ.. పృథ్వీని తప్పుకోవాలని సూచించింది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఎస్వీబీసీలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగినితో రొమాంటిక్‌గా మాట్లాడిన ఘటనలో.. పృథ్వీ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సదరు మహిళతో కలిసి మద్యం తాగాలని ఉందని.. తనంటే ఇష్టమని.. తన గుండెల్లో ఉన్నావంటూ మహిళతో సరసం ఆడారు. ఈ ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆడియో టేపులు బయటపడటంపై పృథ్వీ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. హెచ్‌ఎంటీవీ డిబేట్‌లో ప్రత్యేకంగా మాట్లాడారు. తొలిసారిగా హెచ్‌ఎంటీవీతో ఎక్స్‌క్లూజీవ్‌గా మాట్లాడిన పృథ్వీ.. వివాదంపై వివరణ ఇచ్చారు. అసలా ఆడియోలో ఉన్న వాయిస్.. తనది కాదని తెలిపారు. ఆ ఆడియోకు తనకు ఎలాంటి సంబంధం లేదని.. తేల్చిచెప్పారు. కావాలనే తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని తనకు మహిళలంటే అపార గౌరవమని, ఇంతవరకు ఆడవారి పట్ల ఏ రోజూ అసభ్యంగా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు.

మరోవైపు తనకు ఎస్వీబీసీ ఛైర్మెన్‌గా వచ్చిన అవకాశం చాలామందికి నచ్చడం లేదని, అందులో భాగంగానే తాజా ఆడియో టేపు లీకేజీ వ్యవహారం వచ్చినట్లు.. పృథ్వీరాజ్ చెబుతున్నారు. దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా మీడియాకు విడుదల చేశారు. ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదని మరోసారి స్పష్టం చేశారు.

ఇటు పృథ్వీ ఆడియో వ్యవహారంపై టీటీడీ సీరియస్‌ అయ్యింది. టీటీడీ విజిలెన్స్‌ కూడా విచారణ చేపట్టింది. ఎస్వీబీసీ కార్యాలయంలో ఆయనను విచారించి.. పలువురు సిబ్బంది నుంచి వివరాలు సేకరించింది. ఇదే వ్యవహారంపై టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆరా తీశారు. పృథ్వీతో ప్రత్యేకంగా మాట్లాడారు. విజిలెన్స్‌ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని.. స్పష్టం చేశారు. అయితే విషయం సీరియస్‌ కావడంతో పదవి నుంచి తప్పుకోవాలని టీటీడీ సూచించింది. దీంతో పృథ్వీరాజ్‌ తన పదవికి రాజీనామా చేశారు.  

Tags:    

Similar News