Botsa Satyanarayana: హెరిటేజ్ నోటీసులు 'పిల్ల చేష్టలు'.. చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందే
Botsa Satyanarayana: టీడీపీ ప్రభుత్వం మరియు హెరిటేజ్ సంస్థ తీరుపై శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Botsa Satyanarayana: హెరిటేజ్ నోటీసులు 'పిల్ల చేష్టలు'.. చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందే
Botsa Satyanarayana: టీడీపీ ప్రభుత్వం మరియు హెరిటేజ్ సంస్థ తీరుపై శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనపై హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు ఇచ్చిందన్న వార్తలపై స్పందించిన ఆయన, ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నోటీసులు అందలేదు.. అవి పిల్ల చేష్టలే!
"నాకు ఇంతవరకు హెరిటేజ్ నోటీసులు అందలేదు, కేవలం మీడియాలోనే చూశాను. నా 22 ఏళ్ల రాజకీయ జీవితంలో కేవలం రెండుసార్లు మాత్రమే నోటీసుల మాట విన్నాను. గతంలో రామోజీరావు గారు ఇచ్చారు, ఇప్పుడు చంద్రబాబు అండ్ కో ఇస్తున్నారు. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ సహ ఉత్పత్తిదారు కాదా? వారి వెబ్ సైట్ లోనే ఆ విషయం ఉంది. మేము ఆధారాలు బయటపెట్టగానే వెబ్ సైట్ నుండి ఆ వివరాలు ఎందుకు తొలగించారు?" అని బొత్స ప్రశ్నించారు. టీడీపీ నేత కుటుంబరావు కూడా ఇదే విషయాన్ని గతంలో చెప్పారని ఆయన గుర్తు చేశారు.
లడ్డూ కల్తీ ఆరోపణలపై క్షమాపణ చెప్పాలి
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై చంద్రబాబు నాయుడు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని బొత్స మండిపడ్డారు.
సిట్ నివేదిక ఏమైంది?: "అనిమల్ ఫ్యాట్ లేదని విచారణ సంస్థలు చెప్పినట్లు తెలుస్తోంది. నిజంగా జంతువుల కొవ్వు ఉంటే ఆ సిట్ నివేదికను సభ ముందు ఎందుకు పెట్టడం లేదు? రాజకీయాల కోసం వేంకటేశ్వరస్వామిని వివాదాల్లోకి లాగడం సిగ్గుచేటు" అని ధ్వజమెత్తారు.
అబద్ధపు ప్రచారంతో భక్తులను ఆందోళనకు గురిచేసినందుకు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మండలిలో వివక్షపై ఫిర్యాదు:
శాసన మండలిలో వైసిపి సభ్యులు మాట్లాడుతుంటే లైవ్ కట్ చేస్తున్నారని బొత్స ఆరోపించారు. కేవలం ప్రభుత్వ పక్షం మాటలనే లైవ్ ఇస్తున్నారని, దీనిపై మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇందాపూర్ డైరీ వివాదంపై చర్చకు తాము మూడు రోజులుగా అడుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పారిపోతోందని ఆయన నిలదీశారు. చర్చ జరిగితే అన్ని నిజాలు బయటపడతాయన్న భయంతోనే ప్రభుత్వం వెనుకాడుతోందని బొత్స విమర్శించారు.