AP DSC 2026 Notification : ఏపీ నిరుద్యోగులకు ఉగాది బొనంజా.. డీఎస్సీ నోటిఫికేషన్ డేట్ ఫిక్స్!

ఏపీ నిరుద్యోగులకు ఉగాది బొనంజా.. డీఎస్సీ నోటిఫికేషన్ డేట్ ఫిక్స్!

Update: 2026-02-19 01:41 GMT

AP DSC 2026 Notification : ఏపీలో కొలువుల జాతర మొదలుకాబోతోంది. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగులకు ఏపీలోని కూటమి ప్రభుత్వం అదిరిపోయే ఉగాది కానుకను సిద్ధం చేసింది. రాష్ట్రంలో ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామన్న హామీని నిలబెట్టుకుంటూ, ఈ ఏడాది మరో కొత్త నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మార్చి 19న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కీలక ప్రకటన వెలువడనుంది.

ఏ ఏ శాఖల్లో ఎన్ని పోస్టులు?

విద్యాశాఖ సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో సుమారు 3,600 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. వీటి వివరాలు ఇలా ఉన్నాయి:

* ప్రభుత్వ, పంచాయతీరాజ్, మున్సిపల్ స్కూళ్లు: 1,700 పోస్టులు.

* రెసిడెన్షియల్ (గురుకులాలు), ఆదర్శ పాఠశాలలు, సంక్షేమ శాఖ స్కూళ్లు: 1,200 పోస్టులు.

* ప్రత్యేక విద్యా పోస్టులు: 700 పోస్టులు.

గత ఏడాది ఇప్పటికే 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించిన ప్రభుత్వం, మిగిలిపోయిన ఖాళీలతో పాటు కొత్తగా ఏర్పడిన పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది.

సిలబస్‌లో మార్పుల్లేవు.. అభ్యర్థులకు ఊరట

ప్రిపరేషన్‌లో ఉన్న అభ్యర్థులకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఈసారి డీఎస్సీ సిలబస్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది. గత ఏడాది అనుసరించిన సిలబస్‌నే ఈసారి కూడా వర్తింపజేయనున్నారు. తొలుత ఇంగ్లీష్, కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షలు పెట్టాలని భావించినప్పటికీ, అభ్యర్థుల సౌకర్యార్థం ఆ నిర్ణయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టింది.

కాంట్రాక్ట్ టీచర్లకు వెయిటేజీ భరోసా

పదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని, టెట్ అర్హత సాధించిన కాంట్రాక్ట్ టీచర్లకు ఈ డీఎస్సీలో వెయిటేజీ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారికి మినిమం టైం స్కేల్ అమలు చేసేందుకు కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. దీనివల్ల దాదాపు 2,600 మంది ప్రత్యేక విద్యా విభాగం ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఉగాది నాడే నోటిఫికేషన్ వస్తుందన్న వార్తతో అభ్యర్థులు అప్పుడే కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు.

Tags:    

Similar News