పోలవరంపై పీపీఏ కీలక భేటీ.. కేంద్ర నిధులపై రానున్న క్లారిటీ

Update: 2020-11-02 04:07 GMT

పోలవరం భవిష్యత్‌పై నీలి నీడలు కమ్ముకుంటున్న సమయంలో పీపీఏ భేటీ ఉత్కంఠను రేపుతోంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ రాష్ట్ర ప్రభుత్వ సలహాలను సంపూర్ణంగా వింటుందా కేంద్రం చెప్పిన మొత్తానికి ఏపీ ప్రభుత్వం అంగీకరిస్తుందా అని తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోని పీపీఏ కార్యాలయంలో జరిగే ఈ భేటీ రాష్ట్ర రైతాంగ భవిష్యత్‌ను డిసైడ్ చేయనుంది.

గత నెల 12న పీపీఏకి కేంద్ర ఆర్థిక శాఖ పోలవరం తుది నిర్మాణంపై ఓ లేఖ రాసింది. ఈ శాఖ పెట్టిన షరతులే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరుగనుంది. తుది అంచనాలపై తన అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ భావిస్తోంది. టీఏసీ ఆమోదించిన 55వేల 5వందల 49 కోట్ల అంచనా వ్యయానికి ఆమోదించాల్సిందేనని భేటీలో స్పష్టం చేయనుంది.

నిజానికి విభజన చట్ట ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రానిదే ఈ క్రమంలో పోలవరం అంచనాలపై తమ వాదనను గట్టిగా వినిపించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. పునరావాసంతో సహా కేంద్రమే పోలవరం ప్రాజెక్టుకు నిధులు సమకూర్చాలని ఏపీ ప్రభుత్వం తన డిమాండ్‌ను వినిపించనుంది. ఇంకా జాప్యం చేస్తే పనులు ఆలస్యమై అంచనా వ్యయం మరింత పెరిగే అవకాశముందని ఏపీ ప్రభుత్వం స్పష‌్టం చేయనుంది. 

Tags:    

Similar News