Bandaru Shravani: టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజల కలకలం
Bandaru Shravani: శింగనమల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు శ్రావణి నివాసం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
Bandaru Shravani: శింగనమల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు శ్రావణి నివాసం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పక్కా ప్లాన్ ప్రకారం కారులో వచ్చిన దుండగులు, ఎమ్మెల్యే ఇంటి ముందు క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులు పడేసి వెళ్లడం స్థానికంగా కలకలం రేపింది.
ఓ స్విఫ్ట్ కారులో వచ్చిన వ్యక్తులు ఎమ్మెల్యే ఇంటి ఎదుట నిమ్మకాయలు, తెల్ల నువ్వులు చల్లారు. దీనిని గమనించిన ఎమ్మెల్యే అనుచరులు వారిని వెంబడించేందుకు ప్రయత్నించగా, దుండగులు కారును అతివేగంతో నడుపుకుంటూ పారిపోయారు. అయితే, ఆ కారు నంబర్ AP 39 KX 0986 అని అనుచరులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో ఈ వాహనం గుంటూరుకు చెందిన మొగిలి ఆదిలక్ష్మి పేరిట రిజిస్టర్ అయినట్లు తేలింది.
గత కొన్ని నెలలుగా తమ నివాస ప్రాంతంలో ఇవే తరహా ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఎమ్మెల్యే శ్రావణి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్షుద్రపూజల వల్లే తమ కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
శింగనమల నియోజకవర్గానికి చెందిన ఒక అసమ్మతి నేత ఈ చర్యల వెనుక ఉన్నారని ఎమ్మెల్యే వర్గీయులు బలంగా ఆరోపిస్తున్నారు. ఆమెను రాజకీయంగా ఎదుర్కోలేక, ఇలాంటి క్షుద్ర మార్గాల ద్వారా మానసిక వేధనలకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు.
ఎమ్మెల్యే అనుచరుల ఫిర్యాదుతో అనంతపురం టూటౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. కారు నంబర్ మరియు ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజీని సేకరించారు. నిందితులు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరి ఆదేశాల మేరకు ఈ పని చేశారనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఒక ఎమ్మెల్యే నివాసం వద్దే ఇలాంటి ఘటన జరగడంతో పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు.