Pawan Kalyan Manyam Tour: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో పర్యటించి మరోసారి అక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 2018 లో తాను ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు అక్కడి ప్రజలు ఇప్పటికీ రోడ్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నట్లు ఆయన తెలుసుకున్నారు. వృద్ధులు కూడా మంచి నీటి కోసం నెత్తిపై బిందె పెట్టుకుని కిలో మీటర్ల దూరం కాలినడకన వెళ్తున్నట్లు ఓ వృద్ధురాలు అప్పట్లో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు.
రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల గర్భిణీలకు పురిటి నొప్పులు వచ్చినా, లేక ఎవరైనా అనారోగ్యం బారినా పడినా వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడంలో అనేక ఇబ్బందులు పడుతున్నట్లు అక్కడి స్థానికులు చెప్పారు. ఇప్పటికీ రోగులను మంచంపైనో లేక డోలీలోనో తీసుకుని వెళ్లాల్సిన దుస్థితి ఉందని పవన్ కళ్యాణ్‌కు చెప్పుకుని వాపోయారు.
అప్పుడు ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్ కల్యాణ్.. తాజాగా డిప్యూటీ సీఎం హోదాలో ఆ ప్రాంతంలో పర్యటించారు. పార్వతీపురం మన్యం జిల్లా బాగుజోలలో ( Pawan Kalyan in Bagujola) రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
పార్వతీపురం, అల్లూరి సీతారామ రాజు జిల్లాల్లోని 9 గిరిజన గ్రామాలకు ప్రత్యక్షంగా మేలు జరిగేలా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. పరోక్షంగా ఆ చుట్టు పక్కల ఉన్న మరెన్నో గ్రామాలకు కూడా ఈ రోడ్డు నిర్మాణం ఉపయోగపడుతుందంటున్నారు. రూ. 49.73 కోట్ల రూపాయలతో 48 కిమీ మేర ఈ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు.
పార్వతీపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన, రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఆయన పాత వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. గతంలో పవన్ కల్యాణ్ అక్కడి ప్రజలతో మాట్లాడుతూ.. మీరు ఓట్లు వేసినా, వేయకపోయినా మీకు మనస్ఫూర్తిగా అండగా ఉంటానని అప్పట్లో మాటిచ్చారని, అలాగే ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటున్నారని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ( Pawan Kalyan's Fans) అంటున్నారు. ఇకపై కూడా ప్రతీ 2 నెలలకు ఒకసారి మూడు రోజుల పాటు పార్వతిపురం మన్యం జిల్లాలో పర్యటించి ఇక్కడి ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ మరోసారి మాటిచ్చారు.