జనసేన చేపట్టిన వనరక్షణ కార్యక్రమం సందర్భంగా.. పవన్ కల్యాణ్ హైదరాబాద్ శివార్లలోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలతో.. మొక్కలు నిర్వహించారు. ముందుగా భూమిని పూజించి.. పృథ్వీ సూక్తం పఠించి.. మొక్కలు నాటే కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. తనతో పాటు.. కార్యకర్తలు కూడా మొక్కలు నాటించారు. పర్యావరణ పరిరక్షణ జనసేన సిద్ధాంతాలలో ఒకటని.. ఈ సిద్ధాంతాన్ని ఆచరణలోకి తీసుకువచ్చే కార్యక్రమం ఇదని.. పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ పవిత్ర మాసంలో అందరినీ కలుపుకొని.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఊరూరా చేపట్టాలని.. ప్రతి జన సైనికుడు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగం కావాలని కోరారు.
ఇటు పవన్ కల్యాణ్ కార్తీక మాస దీక్షను చేపట్టారు. ఈ నెల అంతా ఘనాహారం స్వీకరించకుండా.. ఒక్క ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. వివిధ సందర్భాలను అనుసరించి.. ఏడాదిలో ఏకంగా 7 నెలలు వివిధ రకాల దీక్షల్లో ఉంటున్నారు. పవిత్రంగా భావించే కార్తీక మాసంలో పర్యావరణ పరిరక్షణకు సంకల్పించామని.. ఇది ఏదో ఒక నెలకు మాత్రమే పరిమితం కాకుండా.. దీన్ని నిరంతర కార్యక్రమంగా చేపట్టినట్లు వివరించారు.