నేడే ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ మహేశ్వరి ప్రమాణం

Update: 2019-10-07 02:34 GMT

ఏపీ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జితేంద్రకుమార్ మహేశ్వరి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన చేత గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్యఅధితిధిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి పదోన్నతిపై ఆంధ్రాకు బదిలీ అయ్యారు జస్టిస్‌ మహేశ్వరి.. ఆయనను ఏపీ హైకోర్టు సీజేగా నియమిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

అమరావతిలో ఏపీ హైకోర్టు ప్రారంభమైనప్పటినుండి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవరిస్తున్నారు. గత 9 నెలలుగా ఏసీజేగా ఆయన విధులను నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయి సీజే నియామకంతో జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆ బాధ్యతల నుంచి వైదొలిగి సీనియర్‌ న్యాయమూర్తిగా రెండో స్థానంలో కొనసాగుతారని సమాచారం. కాగా జస్టిస్‌ మహేశ్వరి 1961 జూన్‌ 29న మధ్యప్రదేశ్‌లో జన్మించారు. 1985 నవంబర్‌ 22న న్యాయవాదిగా వృత్తి జీవితాన్నిప్రారంభించారు. 2005 నవంబర్‌ 25న మధ్యప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై.. 2008లో శాశ్వత న్యాయమూర్తిగా అర్హత సాధించారు. 

Tags:    

Similar News