IndiGo Crisis: ఇండిగో విమానాల రద్దు.. అందుబాటులో ప్రత్యేక రైళ్లు
IndiGo Crisis: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు కొనసాగుతుండటంతో ప్రయాణికులకు ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
IndiGo Crisis: ఇండిగో విమానాల రద్దు.. అందుబాటులో ప్రత్యేక రైళ్లు
IndiGo Crisis: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు కొనసాగుతుండటంతో ప్రయాణికులకు ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. రద్దీని తగ్గించేందుకు రైల్వే శాఖ అదనపు కోచ్‌లు, ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్-చెన్నై, చర్లపల్లి-కోల్‌కతా, హైదరాబాద్-ముంబయి మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఇంకా బెర్తులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా, 37 రెగ్యులర్ రైళ్లకు అదనంగా 116 కోచ్‌లను జోడించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈ అదనపు బోగీలతో నడుస్తున్నాయి.
ఇండిగో విమానాల రద్దు కారణంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర మంత్రులు స్పందించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ఆయన చెప్పారు. విమానాలు రద్దు కావడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తామని, బాధిత ప్రయాణికులకు తగిన రీఫండ్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు. ప్రయాణికులు రైల్వే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.