విశాఖ వాసులకు అలర్ట్.. రుషికొండ బీచ్‌కు వెళ్లాలంటే ఛార్జీల మోత..?
Rushikonda Beach: రుషికొండ బీచ్ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే యోచనలో ప్రభుత్వం
విశాఖ వాసులకు అలర్ట్.. రుషికొండ బీచ్‌కు వెళ్లాలంటే ఛార్జీల మోత..?
Rushikonda Beach: వైజాగ్ అంటే అందమైన బీచ్‌లు గుర్తుకొస్తాయి. సముద్రతీరంలో కాసేపు సేదదీరితే ఒత్తిడి తగ్గుతోంది. అందుకే విశాఖ వాసులు సాయంత్రం అలా బీచ్‌కు వెళ్తుంటారు. ఐతే ఇకపై బీచ్‌కు వెళ్లాలంటే ఎంట్రీ ఫీజు కట్టే పరిస్థితి వస్తుందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.
రుషికొండ బీచ్‌కు ఇప్పటి వరకూ ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. స్పీడ్ బోట్లు, పార్కింగ్ ద్వారా ఆదాయం వస్తోంది. అయితే అవి ఖర్చులకు సరిపోవడం లేదు. దాంతో బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు వాటికి అవసరమైన ఆదాయాన్ని సమకూర్చుకునే దిశగా ఆలోచన చేస్తున్నాయి. ఈ మేరకు గత నెలలో రుషికొండ బీచ్‌ను ప్రైవేటు నిర్వహణకు ఇస్తామని, ఎవరైనా ముందుకు రావాలని ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనికి పెద్దగా స్పందన రాలేదు. దాంతో మళ్లీ ఈ నెలలో ప్రకటన ఇచ్చారు.
రుషికొండ బీచ్‌కు వచ్చిన బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ కొనసాగాలంటే, 33 రకాల ప్రమాణాలు పాటించాలి. జ్యూరీ సభ్యులు వచ్చి పరిశీలించి, నివేదిక ఇచ్చాక మళ్లీ సర్టిఫికెట్ ఇవ్వాలా లేదా అని నిర్ణయిస్తారు. గత జూన్‌లో జ్యూరీ వచ్చి ప్రమాణాలను పరిశీలించి వెళ్లి, బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇవ్వచ్చని సిఫార్సు చేసింది. ఓ పండుగను నిర్వహించి, అధికారులు ప్రత్యేకమైన జెండాను బీచ్‌లో ఎగురవేస్తారు. ఈ నెలాఖరులోగా ఫ్లాగ్ పండుగ వుంటుందని అధికారులు భావిస్తున్నారు.
బీచ్‌లో ఎంట్రీ ఫీజును ప్రకృతి ప్రేమికులు వ్యతిరేకిస్తున్నారు. తీరం అందాలు ఆస్వాదించడానికి కూడా టికెట్ చెల్లించడం అత్యంత దారుణమని మండిపడుతున్నారు. ప్రభుత్వం టికెట్ రేట్లపై పునారాలోచన చేయాలని విశాఖ వాసులు కోరుతున్నారు.