మదనపల్లె దస్త్రాల దహనం కేసులో కీలక మలుపు.. మాజీ ఆర్డీవో మురళి అరెస్ట్

Madanapalle: మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2025-09-19 06:43 GMT

Madanapalle: మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మదనపల్లె పూర్వ ఆర్డీవో మురళిని సీఐడీ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆయనకు గతంలో మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయడంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.

గతేడాది జూలై 21న మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కొన్ని ముఖ్యమైన ప్రభుత్వ దస్త్రాలు అగ్నిప్రమాదంలో ధ్వంసమయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు, ఆనాటి ఆర్డీవో మురళిని ఈ ఘటనకు ప్రధాన కారకుడిగా గుర్తించారు. ఈ కేసులో ఆయనకు గతంలో మధ్యంతర బెయిల్ మంజూరైంది. అయితే, నిన్న సుప్రీంకోర్టు ఈ బెయిల్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే సీఐడీ పోలీసులు రంగంలోకి దిగారు. తిరుపతిలో ఉన్న మురళిని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. మురళి 2022 అక్టోబర్ నుంచి 2024 ఫిబ్రవరి 5 వరకు మదనపల్లె ఆర్డీవోగా పనిచేశారు. బెయిల్ రద్దయిన 24 గంటల్లోపే ఆయన అరెస్టు కావడం గమనార్హం. ఈ కేసులో తదుపరి దర్యాప్తును సీఐడీ అధికారులు వేగవంతం చేశారు.

Tags:    

Similar News