Anakapalli: మత్స్యకారుడిని లాక్కెళ్లిన చేప.. సముద్రంలో గల్లంతు

Anakapalli: అనకాపల్లి జిల్లాలోని పూడిమడక గ్రామాన్ని విషాదం ముసురుకుంది.

Update: 2025-07-03 05:00 GMT

Anakapalli: అనకాపల్లి జిల్లాలోని పూడిమడక గ్రామాన్ని విషాదం ముసురుకుంది. చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు సముద్రపు అలల మధ్య గల్లంతు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

వివరాల్లోకి వెళ్తే…అచ్యుతాపురం మండలం పూడిమడకకు చెందిన చోడపల్లి యర్రయ్య (26) తన తమ్ముడు కొర్లయ్య, వాసుపల్లి యల్లాజి, గనగళ్ల అప్పలరాజులతో కలిసి బుధవారం తెల్లవారుజామున సముద్రంలో చేపల వేటకు వెళ్లాడు. తీరానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో వేట సాగిస్తుండగా, గేలానికి సుమారు 100 కిలోల బరువున్న కొమ్ముకోనాం చేప చిక్కింది.

అందిన ఈ భారీ చేపను తాడుతో బోటులోకి లాగాలని యర్రయ్య ప్రయత్నించగా, మిక్కిలి బలంగా అలజడి చేసిన ఆ చేప అతడిని నీటి లోపలికి లాక్కెళ్లింది. కళ్ల ముందు ఇలా జరుగుతుండటంతో తమ్ముడు కొర్లయ్య ఆందోళనకు గురయ్యాడు. వెంటనే గ్రామస్థులకు సమాచారం అందించాడు.

అక్కడి స్థానికులు పడవల్లో సముద్రంలో గాలింపు చేపట్టినా… సాయంత్రం వరకు యర్రయ్య ఆచూకీ లభించలేదు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. యర్రయ్య తల్లి కోదండమ్మ కన్నీరుమున్నీరుగా విలపించగా, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శోక సంద్రంలో మునిగిపోయారు.

ప్రస్తుతం మరికొద్ది దూరం గాలింపు కొనసాగుతుందని గ్రామస్థులు తెలిపారు. ఈ విషాద ఘటన పూడిమడక గ్రామాన్ని తీవ్ర ముంచేసింది.

Tags:    

Similar News