Sand Shortage in Ongole: ఏపీలో ఇసుక ఇక్కట్లు!

Update: 2020-07-06 03:56 GMT

Sand Shortage : కరోనా లాక్‌డౌన్‌ సడలింపులు మొదలు కావడంతో అన్నిరంగాలలో కార్యకలాపాలు మొదలవుతున్నాయి. ప్రభుత్వాలు కూడా పనులను ప్రోత్సహిస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణరంగం మాత్రం కదలడం లేదు. ఉపాధి లేక భవన నిర్మాణ కూలీలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో అధికార పక్షం ఇసుక సరఫరాలో విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి

ఒంగోలు జిల్లాలో ఇసుక లభ్యత ప్రస్తుతం గగనంగా మారింది. డిపోల్లో నిల్వలు కనిపిస్తున్నా వినియోగదారుల డిమాండ్‌ మేరకు సరఫరా కావడం లేదు. ఇప్పటి వరకు బుకింగ్‌ చేసుకున్న వినియోగదారుల్లో 85 నుంచి 90 శాతం వరకు సరఫరా చేసినట్లు లెక్కలు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారికి 72 గంటల్లోనే సరఫరా చేయనున్నట్లు ప్రకటించినా పది రోజులకూ రావడం లేదన్న విమర్శలున్నాయి.

ఇసుక సరఫరాను సులభతరం చేసేందుకు నియోజకవర్గానికో డిపోను ఏర్పాటు చేశారు. మొత్తం 11 డిపోలు ఉండగా- ప్రస్తుత్తం తొమ్మిది డిపోల్లో 46 వేల టన్నుల ఇసుక నిల్వ ఉంది. పేరుకు నిల్వలు కనిపిస్తున్నా వినియోగదారులకు మాత్రం ఇసుకంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇసుక కొరత వల్ల గత కొంత కాలంగా నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వేల మంది భవన నిర్మాణ పనులు పై ఆధారపడి జీవిస్తున్నారు. అటువంటి వారి బ్రతుకులు దిగజారిన పరిస్థితులలో ఉన్నారు.

వర్షాకాలం సీజన్‌ నేపథ్యంలో ఇసుకకు మరింత గిరాకీ పెరగనుంది. ఆ మేరకు ముందస్తుగా డిపోల్లో సరిపడా నిల్వలు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. నదుల్లో కొరతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో పూర్తిగా పట్టా భూముల్లోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. జిల్లాలో నెలకొన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నెల్లూరు జిల్లా నుంచి రవాణా చేయాలని గనులశాఖ అధికారులు నిర్ణయించారు.

ట్రాక్టర్‌ ట్రక్కు ఇసుకను 4.50 టన్నులుగా పరిగణిస్తారు. ఒక్కో టన్నుకు రూ. 375 చొప్పున చెల్లించాలి. ఇసుక రవాణా ఛార్జీలు అదనం. ఎంత దూరం ఉంటే ఆ లెక్కన కి.మీ.కు రూ. 4.90 చొప్పున టన్నుకు అదనంగా చెల్లించాలి. ఇంత వరకు సరేలే అనుకున్నా సచివాలయాలు, ఆన్‌లైన్‌లో నమోదుకు సర్వర్‌ సమస్య ప్రతిబంధంగా మారింది. రోజుల తరబడి తిరిగినా ఫలితం లేకుండా పోతోందని వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇసుకంటేనే హడలెత్తి కొందరు భవన నిర్మాణాలనే వాయిదా వేసుకుంటుండగా- మరికొందరు నిర్మాణ పనులను అసంపూర్తిగా నిలిపివేశారు. వివాహాలు పెట్టుకున్న వారు.. చేసేదేమీ లేక నల్లబజారులో కొనుగోలు చేస్తుండగా- గిరాకీ బట్టి ప్రాంతానికో ధర ఉంటోంది. దీంతో ప్రభుత్వం ఇప్పటికైన స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మికులు కోరుతున్నారు. 

Full View


Tags:    

Similar News