Road Accident: డాక్టరమ్మగా చూడాలనుకున్నారు.. అంతలోనే విధి వంచించింది! రోడ్డు ప్రమాదంలో యువ వైద్యురాలు మృతి
Road Accident: ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెను ఉన్నత విద్యావంతురాలిని చేశారు.
Road Accident: ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెను ఉన్నత విద్యావంతురాలిని చేశారు. మరికొద్ది రోజుల్లో ఆమె పూర్తిస్థాయి వైద్యురాలిగా సమాజానికి సేవ చేస్తుందని, తమ కల నెరవేరుతుందని ఆశపడ్డారు. కానీ, విధి ఆ కుటుంబంపై పగబట్టింది. ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఆ ఇంటి ఆశల దీపాన్ని ఆర్పేసింది. చాగల్లుకు చెందిన యువ దంత వైద్యురాలు జొన్నకూటి లిఖిత మరణం స్థానికంగా పెను విషాదాన్ని నింపింది.
వివరాల్లోకి వెళ్తే.. చాగల్లుకు చెందిన వీర్రాజు, మహాలక్ష్మి దంపతుల కుమార్తె లిఖిత. తండ్రి వీర్రాజు రాజమహేంద్రవరం డీఎంహెచ్‌వో కార్యాలయంలో పారామెడికల్ అధికారిగా పనిచేస్తుండగా, తల్లి అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. తమ పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలని కష్టపడి చదివించారు. కుమారుడు భాను ప్రసాద్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడగా, కుమార్తె లిఖిత బీడీఎస్ (BDS) పూర్తి చేశారు.
ఇంటర్న్‌షిప్ ముగుస్తున్న తరుణంలోనే.. లిఖిత ప్రస్తుతం రాజమహేంద్రవరం శివారులోని ఒక ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో పూర్తి కావాల్సి ఉంది. ఇంతలోనే జరిగిన రోడ్డు ప్రమాదం ఆమె ప్రాణాలను బలి తీసుకుంది. గ్రామానికి డాక్టరమ్మగా పరిచయం కావాల్సిన అమ్మాయి, ఇలా విగతజీవిగా తిరిగి రావడంతో చాగల్లు గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కష్టపడి చదివించి ప్రయోజకురాలిని చేసిన కుమార్తె, కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. చాగల్లులో నిర్వహించిన లిఖిత అంత్యక్రియలకు బంధువులు, మిత్రులు భారీగా తరలివచ్చి కడసారి వీడ్కోలు పలికారు.