ఉద్యోగాలు రానివారు నిరుత్సాహపడొద్దు.. వారికోసం..

ఉద్యోగాలు రానివారు నిరుత్సాహపడొద్దు.. వారికోసం.. ఉద్యోగాలు రానివారు నిరుత్సాహపడొద్దు.. వారికోసం..

Update: 2019-09-30 06:21 GMT

గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన కొంతమంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు ముఖ్యమంత్రి జగన్. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇకనుంచి గ్రామస్వరాజ్యం సచివాలయ ఉద్యోగులతోనే ప్రారంభమవుతుందని అన్నారు. వాలంటీర్లను సమన్వయం చేసుకొని గ్రామ/వార్డుల్లో సేవలు అందించాలని కోరారు. తమ వద్దకు వచ్చే ప్రతి అప్లికేషన్ కు 72 గంటల్లోగా పరిష్కారం చూపాలన్నారు. అవినీతికి తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ప్రభుత్వ పధకాలను అందించాలని కోరారు. ఇప్పటిదాకా ఏమి కావాలన్నా లంచం అందించే దుస్థితి ఇకనుంచి మీతోనే పోవాలని సచివాలయ ఉద్యోగులకు చెప్పారు. ఇకనుంచి ఎవరికీ ఏమి కావాలన్నా సచివాలయాన్ని ఆశ్రయించాలని ప్రజలను కోరారు. పనులకోసం వచ్చే ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి పని పూర్తి చెయ్యాలని కోరారు.

అలాగే గ్రామాల్లో త్వరలో ఏర్పాటు చేయనున్న ఎరువుల దుకాణాలను కూడా దగ్గరుండి పర్యవేక్షించాలని కోరారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందించడంలో ఇకనుంచి సచివాలయ ఉద్యోగులది కీలక పాత్ర అని చెప్పారు. ఇక్కడ కూడా అవినీతి జరిగింది అంటే సహించేది లేదన్న ముఖ్యమంత్రి.. టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ప్రజలు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ఉద్యోగాలు రానివారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని అన్న జగన్.. ప్రతిఏటా జనవరి నెలలోపు ఖాళీ అయిన ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఇకనుంచి జనవరి నెల మొత్తం ప్రభుత్వ పరీక్షల మాసంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. సచివాలయ పరీక్షలు రికార్డు స్థాయిలో అత్యంత పారదర్శకంగా నిర్వహించినందుకు అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

Tags:    

Similar News