ఆదినారాయణరెడ్డిని అడ్డుకుంటుందెవరు?

Update: 2019-10-04 04:40 GMT

 వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగా బలమైన నేతలను పార్టీలోకి తీసుకునేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే వివిధ పార్టీల నుంచి వస్తున్న నేతలతో పార్టీ కార్యాలయం సందడిగా మారుతోంది. అయితే అందరికి అనుమతి ఇస్తున్న బీజేపీ.. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒకటి కాదు రెండు ఏకంగా నాలుగు నెలలుగా బీజేపీలో చేరేందుకు ఆదినారాయణరెడ్డి ప్రయత్నిస్తూనే ఉన్నారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాను కలిశారు. ఒకటి రెండు సార్లు రాష్ట్ర అగ్రనాయకులతో సమావేశం అయ్యారు. కానీ ఇంతవరకూ పార్టీలో చేరేందుకు అనుమతి లభించడం లేదు. టీడీపీ, జనసేన పార్టీల నుంచి చాలా మంది కీలక నేతలు గురువారం బీజేపీలో చేరారు. కానీ ఆదినారాయణరెడ్డికి మాత్రం నిన్న కూడా ఛాన్స్ దొరకలేదు. అయితే ఆయన చేరికను సీఎం రమేష్ అడ్డుకుంటున్నారన్న ప్రచారం కడప జిల్లాలో జోరుగా సాగుతోంది.

వీరిద్దరి మధ్య వైరం ఇంకా కొనసాగుతూనే ఉందని.. దాంతో ఆది చేరిక ఆలస్యం అవుతుందని అనుకుంటున్నారు. వాస్తవానికి టీడీపీలో ఉన్న సమయంలోనే ఎంపీ సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఎన్నికల అనంతరం సీఎం రమేష్ బీజేపీలో చేరారు. ఆది కూడా టీడీపీలో ఇమడలేక బీజేపీలో చేరాలని అనుకుంటున్నారు. కానీ ముహూర్తం కుదరడం లేదు. దీనికి కారణం సీఎం రమేషే అని ఆది అనుచరులు అనుకుంటున్నారు. ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరితే ఎక్కడ తమ పెత్తనానికి అడ్డు వస్తాడో అని సీఎం రమేష్ అడ్డుకట్ట వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే సీఎం రమేష్ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించలేదు. ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి స్వాగతించలేదు. దీంతో విసిగిపోయిన ఆదినారాయణరెడ్డి దసరా తరువాత బీజేపీ అధిష్టానం పెద్దలను కలవాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. పార్టీలో చేర్చుకుంటారా లేదా అనే విషయంపై క్లారిటీ తీసుకోవాలని ఆయన ఫిక్స్ అయినట్టు సమాచారం.  

Tags:    

Similar News