Live Updates: ఏపీ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌

Update: 2021-03-10 03:05 GMT

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌: లైవ్‌ అప్‌డేట్స్‌

AP Municipal Elections 2021 : ఏపీలోని పుర, నగర పాలక పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోని 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్‌ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. మొత్తం 2,214 డివిజన్లు/వార్డుల్లో కలిపి 77,73,231 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 7,549 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Live Updates
2021-03-10 11:53 GMT

ఏపీలో:

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాయి. 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాల్టీల్లో ఎన్నికలు జరిగాయి. 16వందల 33వార్డులు, 582 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. విజయనగరం, విశాఖ, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఇక, ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 53.57 శాతం పోలింగ్‌ నమోదైంది. పలుచోట్ల మందకొడిగా పోలింగ్‌ సాగింది. ఈనెల 14న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

2021-03-10 11:36 GMT

 అమలాపురం:

స్వల్ప ఘటనలు మినహా అమలాపురం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని డీఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. సున్నితమైన ప్రాంతంలో పోలీసులు సమన్వయంతో పని చేశారని అన్నారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ వరకు బ్యాలెట్ బాక్సులు పూర్తి భధ్రతతో తమ ఆధీనంలోనే ఉంటాయంటోన్న అమలాపురం డిఎస్పీ.

2021-03-10 10:56 GMT

కృష్ణా జిల్లా:

కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల పరిశీలనకు వెళ్లిన మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి అనుమతిలేదంటూ పక్కకు తోసేశారు. దీంతో పోలీసులు, కొల్లు రవీంద్రకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ.. నేలపై కూర్చొని నిరసనకు దిగారు కొల్లు రవీంద్ర.

2021-03-10 10:55 GMT

తిరుపతి: 

తిరుపతి రెండవ డివిజన్లో పోలింగ్ నిలిచిపోయింది. కొందరు ఓటర్లకు రెండు బ్యాలెట్ పేపర్లు ఇస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడ్డారు. రీ పోలింగ్ నిర్వహించాలని టిడిపి తిరుపతి జిల్లా ఇన్చార్జి నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు.

2021-03-10 10:53 GMT

అమలాపురం: 

అమలాపురంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సున్నితమైన ప్రాంతాల్లో పరిస్థతిని అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. అమలాపురంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలు చేపట్టామన్నారు అమలాపురం మున్సిపల్ కమీషనర్ నాయుడు.

2021-03-10 10:46 GMT

కడప జిల్లా:

కడప జిల్లా ప్రొద్దుటూరులోని 6వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుది. టీడీపీ వర్గీయులు రిగ్గింగ్ చేస్తున్నారంటూ వైసీపీ వర్గీయులు అడ్డుకోగా ఘర్షణ నెలకొంది. దీంతో ఇరు వర్గీయులపై పొలీసులు లాఠి చార్జి చేసి వారిని చెదరగొట్టారు.

2021-03-10 09:43 GMT

విజయవాడ: 

విజయవాడ కార్పొరేషన్‌ పరిథిలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 64 డివిజన్లలో 38.14శాతం పోలింగ్ మాత్రమే నమోదయింది. ఎన్నికల దృష్య్టా నగరంలో ముందస్తు సెలవు ప్రకటించినప్పటికీ ఓటింగ్‌లో పాల్గొనేందుకు ప్రజలు ముందుకు రాలేదు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు నగరంలోని ఏ ఒక్క డివిజన్‌లోనూ 50శాతం పోలింగ్ దాటకపోవడం గమనార్హం. మరోవైపు ఎన్నడూ లేనంత మందకొడిగా పోలింగ్ సాగుతుండడం పట్ల పొలిటికల్ పార్టీలు అయోమయంలో పడుతున్నాయి.

2021-03-10 09:41 GMT

విజయనగరం: 

విజయనగరంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. స్థానిక మహారాజా కాలేజీలో మంత్రి బొత్స సత్యనారాయణ ఆయన సతీమణి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి బొత్స పిలుపునిచ్చారు.

2021-03-10 09:37 GMT

నగరి: 

వైసీపీ ఎమ్మెల్యే రోజా నగరి మున్సిపాల్టీ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మూడో వార్డులోని పోలీంగ్ కేంద్రంలో ఓటు వేశారు. నగరి, పుత్తూరు మున్సిపాలిటీ చైర్మన్ స్థానాలను గెలుచుకుని సీఎం జగన్ కు గిఫ్ట్ ఇస్తామని చెప్పారు. 

2021-03-10 08:06 GMT

గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. 24వ వార్డులోని పోలింగ్‌ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తు్న్నారు. ఈ ఘర్షణలో మాజీ ఎమ్మెల్యే వైవీ. ఆంజనేయులు కారు ధ్వంసం కావడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి... పరిస్థితి అదుపు చేస్తున్నారు.  

Tags:    

Similar News