ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ వీసీ అరెస్ట్‌

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్‌ వల్లభనేని దామోదరనాయుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. గత నెలలో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో వీసీని అరెస్టు చేసినట్లు

Update: 2019-10-21 02:18 GMT

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్‌ వల్లభనేని దామోదరనాయుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. గత నెలలో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో వీసీని అరెస్టు చేసినట్లు తుళ్లూరు డీఎస్పీ తెలిపారు. ఎస్టీ కులానికి చెందిన తనను ఉద్యోగం నుంచి తొలగించి, కులం పేరుతో దూషించారని.. బెదిరింపులకు కూడా గురిచేశారని ఉయ్యాల మురళీకృష్ణ అనే వ్యక్తి గత నెల 24న తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వీసీపై ఎస్సీ, ఎస్టీ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3(1,2)తోపాటు ఐపీసీ 506 కింద కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నం గ్రామానికి చెందిన ఉయ్యాల మురళీకృష్ణ 2016లో ఎన్జీ రంగా వర్సిటీలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో అటెండర్‌గా చేరాడు.

అయితే అనుకోని కారణాల వలన అతడిని ఈ ఏడాది ఏప్రిల్‌ 12న ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటి నుంచి తనను ఉద్యోగంలోకి తీసుకోవాలని వీసీని కోరుతున్నాడు. ఈ క్రమంలో గత నెల 23న సచివాలయంలో వీసీ, రిజిస్ట్రార్‌ ఉన్నారని తెలిసి అక్కడకు వెళ్లి మరోసారి వారిని అడిగారు మురళీకృష్ణ.. దీంతో ఆగ్రహించిన వీసీ మరోసారి తన దగ్గరకు వస్తే అంతు చూస్తానని పైగా కులం పేరుతో దూషించాడని మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను వైకాపా సానుభూతిపరుడిని అన్న కారణంతోనే ఉద్యోగంలోనుంచి బలవంతంగా తీసేశారని వాపోయాడు. మురళీకృష్ణతోపాటు అతడి భార్య విజయదుర్గను, మరికొందరిని కూడా ఉద్యోగం నుంచి తొలగించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీసీ చర్యలతో అకారణంగా నష్టపోయిన ఉద్యోగులు గవర్నర్, సీఎంకు ఫిర్యాదులు చేశారు. 

Tags:    

Similar News