TDP MLA Ganta Srinivas Will Join YCP : ఆగస్టు 15..గంటా గణగణ.!

Update: 2020-07-25 11:54 GMT

TDP MLA Ganta Srinivas Will Join YCP : గంటా గణగణ. మొన్నటి వరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో మోగించిన గణగణ గంటలివి. ట్విట్టర్‌ నుంచి ఫేస్‌ టర్నింగ్ ఇచ్చుకుంటే, ఇప్పుడు అదే గంటా వైసీపీలోనే జేగంట మోగిస్తానంటున్నారట. ఆగస్టు 15న సైకిల్‌‌ నుంచి స్వాతంత్ర్యం పొంది, వైసీపీలో స్వేచ్చాగాలులు పీల్చుకుంటానని తెగేసి చెప్పారట. ఇంతకీ గంటా శ్రీనివాసరావు, వైసీపీలో గంటా మోగించారా మోగించాల్సి వచ్చిందా? సైకిల్‌ నుంచి ఎందుకు దిగాలనుకుంటున్నారు ఇంతకాలం ఎందుకు వర్కౌట్‌ కాలేదు గంటాకు సడెన్‌గా వైసీపీ ద్వారాలు ఎందుకు తెరుస్తోంది? గంటా ఎంట్రీ వెనక మంటలు రేపే మ్యాటరేంటి?

తెలుగుదేశం సీనియర్ నేత, విశాఖపట్నం నార్త్‌ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సైకిల్‌ దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన అతి త్వరలో ఫ్యాన్‌ చెంతకు చేరబోతున్నారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకు ముహూర్తం కూడా ఖాయమైందట. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15న, ఆయనకు టీడీపీ నుంచి ఫ్రీడమ్‌ రాబోతోందని, వైసీపీలో స్వేచ్చావాయువులు పీల్చుకోబోతున్నారని, బలమైన గంటలు గణగణమంటున్నాయి.

అయితే, మొన్నటి మొన్న తుప్పు సైకిళ్లపై గంటా శీను గణగణా 12 కోట్ల కొనుగోళ్లలో 5 కోట్ల అవినీతి అంటూ, సైకిల్‌ స్కామ్‌ బద్దలు కాబోతోందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి బాంబు పేల్చారు. టీడీపీలో నెక్ట్స్ అరెస్టు గంటానే అన్న ఊహాగానాలకు వీఎస్‌ఆర్‌ ట్వీట్‌ హింట్ ఇచ్చారన్న మాటలు వినిపించాయి. సీన్ ‌కట్‌ చేస్తే, ఇప్పుడు గంటా వైసీపీలో మోగబోతోందన్న వార్త. ఈ రెండింటికీ లింకుందా సైకిళ్ల స్కాం భయంతోనే ఆయన, ఫ్యాన్‌ చెంతకు చేరుతున్నారా? పొగపెట్టినందుకే కలుగులోంచి బయటకు వచ్చి, అధికారపక్షం తీర్థం పుచ్చుకుంటున్నారా అన్న అనుమానాలు రావడం సహజం. సరిగ్గా విజయసాయి, హైదరాబాద్‌లో కరోనా చికిత్సలో వున్నప్పుడే గంటా గణగణ ఏంటన్న ప్రశ్నా అత్యంత సహజం. వీఎస్‌ఆర్‌ గ్రౌండ్‌లో లేకపోవడాన్ని మంచి టైంగా చూసుకుని, గంటా చకచకా పావులు కదిపారా?

పార్టీలు మారినా, గంటా శ్రీనివాసరావుకు గెలుపు గ్యారంటీ. మంత్రి పదవి కూడా గ్యారంటీ. కానీ ఇప్పుడు గెలిచారు. కానీ పదవి లేదు. ఏం లేకపోయినా వుండగలరు కానీ, కేబినెట్ పోస్టు లేకపోయినా, అట్‌లీస్ట్ అధికారపక్షంలో లేకపోయినా గంటా తట్టుకోలేరట. తనకు శిష్యుడులాంటి ఫ్రెండు అవంతి, ఎన్నికలకు ముందే వైసీపీలో చేరి మంత్రి అయ్యారు. సమీప భవిష్యత్తులో టీడీపీ కోలుకునేలా లేదు. దీంతో ఏం చెయ్యాలో దిక్కుతోచని గంటా, ఎన్నికల నాటి నుంచి వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి శతవిధాలా ప్రయత్నించారట. కానీ ఉత్తరాంధ్రలో వైసీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న విజయసాయి మాత్రం, గంటాకు గేటు తెరవలేదట. ఇప్పుడు కూడా గంటాకు విజయసాయి కటాక్షం లేదట. కానీ రాజకీయ చాతుర్యంలో పీహెచ్‌డీ చేసిన గంటా, అటు నుంచి నరుక్కుంటూ వచ్చారట.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా వైసీపీలో చేరాలని ఫిక్స్ అయిన గంటా, వైఎస్ జగన్ కజిన్ వైఎస్ అనిల్‌ రెడ్డితో మంతనాలు జరిపారట. ఎన్నికల ప్రచారం, స్ట్రాటజీలో కీరోల్ పోషించిన అనిల్‌ రెడ్డి, సీఎం జగన్‌తో గంటాపై మాట్లాడారట. దీంతో గంటాకు లైన్‌ క్లియర్ అయ్యిందట. ఆగస్టు 15న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో, అఫిషియల్‌గా ఫ్యాన్‌ కిందకు చేరాలని డిసైడయ్యారట. నేరుగా వైసీపీ కండువా కప్పుకుంటే, ఎమ్మెల్యే సభ్యత్వంపై ఎఫెక్ట్‌ పడుతుంది కాబట్టి, వల్లభనేని వంశీ తరహాలో తటస్థ సభ్యుడిగా కొనసాగుతారని వినికిడి.

గంటా రాకతో వైసీపీకి కూడా ఎంతోకొంత లాభం వుంటుందన్నది వినిపిస్తున్న చర్చ. ఎందుకంటే, రాజధానిని విశాఖలో ఏర్పాటు చేస్తోంది. వైజాగ్‌ సిటీలో టీడీపీకి బలముంది. విశాఖ నగరంలోని నాలుగు సీట్లూ టీడీపీవే. దీంతో రాజధానిని పెట్టినా, పార్టీ పరంగా ప్రయోజనంగా వుండాలంటే, ఈ ప్రాంతంలో గట్టి పట్టున్న గంటా చేరితే బాగుంటుందన్నది, వైసీపీ వ్యూహకర్తల ఆలోచన. అందులోనూ మొత్తం టీడీపీ, విశాఖ రాజధానిగా వ్యతిరేకిస్తుంటే, గంటా మాత్రం స్వాగతించారు. వైసీపీకి అలా గంటా మోగించారు. మొత్తానికి ఎన్నాళ్లో వేచిన ఉదయంలాగా, ఎప్పటి నుంచో వైసీపీతో స్నేహానికి ఉవ్విళ్లూరుతున్న గంటా ఆశ, త్వరలో నెరవేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఎలాంటి అల్పపీడనాలు, వాయుగుండాలు గండాలుగా పరిణమించకుంటే, ఆగస్టు 15న, వైసీపీలో గంటా మోగడం ఖాయం. లెట్స్‌ సీ వాట్‌ విల్‌ హ్యాపెన్.

Full View


Tags:    

Similar News