Off The Record: సింగరేణి ఎన్నికల పై కామ్రేడ్ల మద్దతు.. కాంగ్రెస్‌కా, బీఆర్ఎస్‌కా..?
Off The Record: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
Off The Record: సింగరేణి ఎన్నికల పై కామ్రేడ్ల మద్దతు.. కాంగ్రెస్‌కా, బీఆర్ఎస్‌కా..?
Off The Record: సింగరేణిలో ఎన్నికల సైరన్ మోగనుంది. ఇప్పటికే గుర్తింపు సంఘం కాల పరిమితి ముగిసిపోయింది. దీంతో అన్ని సంఘాలు ఎన్నికల వైపు దృష్టి సారించాయి. 2023 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అనుబంధ సంఘమైన AITUC ఘనవిజయం సాధించి గుర్తింపు సంఘంగా అవతరించింది. ఆ యూనియన్ ఐదు ఏరియాల్లో గెలుపొందింది. ఇక కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన INTUC ఆరు ఏరియాల్లో గెలిచినా ఓట్ల శాతం తక్కువగా రావడంతో ప్రాతినిథ్య సంఘం హోదాతో సరిపెట్టుకుంది. అంతకు ముందు ఎన్నికలో.. గుర్తింపు సంఘంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం దారుణ పరాభవం మూటగట్టుకుంది.
వాస్తవానికి తెలంగాణలో సీపీఐ, కాంగ్రెస్ మిత్రపక్షాలుగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు కలిసే పోటీ చేశాయి. హస్తం ప్రభుత్వంలో సీపీఐ భాగం కాకపోయినా..బయటి నుంచి మద్దతు ఇస్తోంది. ఐతే సర్కార్ ఏర్పాటైన వెంటనే సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగగా... కాంగ్రెస్, సీపీఐల దోస్తీ ఆ ఎన్నికల్లోనూ ప్రతిబింబిస్తుంది అనుకున్నారు. కానీ అలా కుదరలేదు. సీపీఐ అనుబంధ సంఘమైన AITUC, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన INTUC ప్రత్యర్థులుగానే పోటీ చేశాయి. కొన్ని చోట్ల బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్ నేతలు ఏఐటీయూసీకి మద్దతు తెలిపారు. అయితే ఆ పొత్తు ఇప్పుడు శాశ్వతం అయ్యేలా కనిపిస్తోంది. ఆ మేరకు సీపీఐ నేతలు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. కొద్ది రోజుల కిందట జరిగిన మున్సిపల్ ఎన్నికలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పలు చోట్ల సీపీఐ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని ఓడించాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి దూరమై, బీఆర్ఎస్‌కు దగ్గరయ్యేందుకు కామ్రేడ్లు ప్రయత్నాలు చేస్తున్నారని పరిశీకులు భావిస్తున్నారు.
బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్‌తో కామ్రేడ్ల పొత్తుకు.. క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీజం పడింది. ఇక్కడ AITUC అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్యను డీసీసీ అధ్యక్షుడు తక్కువ చేసి మాట్లాడటం, మీకు పెద్దగా పట్టులేదని మాట్లాడటం కాస్త కామ్రేడ్లలో కసి పెంచిందట. దీంతో వారు బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని ఓడించారు. ఎన్నికల ప్రచారంలో చాలా చోట్ల బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ వచ్చే సింగరేణి ఎన్నికల్లో తాము, ఏఐటీయూసీ కలిసి పోటీ చేస్తామని బాహాటంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సింగరేణి ఎన్నికల్లో కామ్రేడ్లు, కారు పార్టీతో కలిసి పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది.
మరోవైపు ఈ రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ సింగరేణికి పెద్దగా చేసిందేమీ లేదని ప్రత్యర్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. సంస్థలో కారుణ్య నియామాకాలకు బ్రేక్ వేసిందని ధ్వజమెత్తుతున్నారు. ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహిస్తామని హామీ ఇచ్చినా ఈ పార్టీ రెండేళ్లలో కేవలం రెండుసార్లే మెడికల్ బోర్డు నిర్వహించారని మండిపడుతున్నారు. కొత్త బొగ్గు గనులు ఏర్పాటు చేస్తామని, కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేసినా ఆ పార్టీ పెద్దగా ఏం చేయలేకపోయిందని సంఘం సభ్యులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో కార్మికుల్లో కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌తో కలిసి కార్మికుల ముందుకు వెళితే ఇబ్బందులు తప్పవని భావించిన ఏఐటీయూసీ టీబీజీకేఎస్ తో జతకట్టేందుకు సిద్ధం అవుతోంది. చూడాలి మరి సింగరేణి ఎన్నికలు ఎలాంటి ఆసక్తికర పొత్తులకు దారి తీస్తుందో.