Gas Surcharge: దోశ రూ. 79.. గ్యాస్ ఛార్జీ రూ. 30.. హోటల్ బిల్లు చూసి కస్టమర్ షాక్
Gas Surcharge: గ్యాస్ కొరత పేరుతో రూ. 79 దోశకు అదనంగా రూ. 30 'గ్యాస్ ఛార్జ్' వసూలు చేయడంతో కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Gas Surcharge: దోశ రూ. 79.. గ్యాస్ ఛార్జీ రూ. 30.. హోటల్ బిల్లు చూసి కస్టమర్ షాక్
Gas Surcharge: సాధారణంగా మనం ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్ళినప్పుడు బిల్లులో వడ్డించిన వంటకాల ధరతో పాటు జీఎస్టీ , అప్పుడప్పుడు సర్వీస్ ఛార్జీలు చూడటం అలవాటే. కానీ, ఎప్పుడైనా బిల్లులో గ్యాస్ ఛార్జ్ అని విన్నారా? వినడానికి వింతగా ఉన్నా, ఇప్పుడు భాగ్యనగరంలోని ఐటీ కారిడార్‌లో ఇదే హాట్ టాపిక్. ఒక ప్లేట్ దోశ తింటే, ఆ దోశ ధరలో దాదాపు సగం ధరను 'గ్యాస్ ఛార్జ్' పేరుతో వసూలు చేయడంతో సదరు కస్టమర్ అవాక్కయ్యారు.
అసలేం జరిగిందంటే?
నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలోని ఒక ప్రముఖ హోటల్‌కు వెళ్ళిన ఒక కస్టమర్ ఒక 'ప్లెయిన్ దోశ' ఆర్డర్ చేశారు. మెనూ కార్డు ప్రకారం ఆ దోశ ధర రూ. 79. తిన్న తర్వాత బిల్లు చేతికి రాగానే అందులో ఉన్న అంకెలు చూసి ఆయన కళ్లు బైర్లు కమ్మాయి. దోశ ధర రూ. 79 కాగా, దాని కింద గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ పేరుతో అదనంగా మరో రూ. 30 కలిపారు. అంటే.. కేవలం రూ. 79 కావాల్సిన బిల్లు కాస్తా రూ. 109కి చేరింది.
తనకు ఎదురైన ఈ వింత అనుభవాన్ని సదరు కస్టమర్ ఫోటో తీసి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దోశ వేయడానికి వాడే గ్యాస్‌కు కూడా మేమే విడిగా డబ్బులు కట్టాలా? అంటూ ఆయన వేసిన ప్రశ్న ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. గ్యాస్ కొరత ఉంటే ఆ భారాన్ని నేరుగా కస్టమర్లపై ఇలా వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.ఈ వింత ఛార్జీలు కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్పీజీ సరఫరాలో ఇబ్బందులను సాకుగా చూపుతూ పలు నగరాల్లో రెస్టారెంట్లు ఇలాంటి వినూత్న బాదుడుకు తెరలేపాయి.
ఇక్కడి థియో కేఫ్‌లో ఒక కస్టమర్ లెమనేడ్ ఆర్డర్ చేస్తే, బిల్లుపై 5 శాతం గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ వేశారు. అసలు లెమనేడ్ తయారీకి గ్యాస్ అవసరం ఏముంటుందని కస్టమర్లు వాపోతున్నారు. ఈ మెట్రో నగరాల్లోని పలు ఫుడ్ కోర్టులు, అవుట్‌లెట్లలో కూడా ఇలాంటి అదనపు వసూళ్లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.సాధారణంగా హోటల్ నిర్వహణ ఖర్చులు , గ్యాస్, కరెంట్ వంటివన్నీ కలిపి వంటకాల ధరలను నిర్ణయిస్తారు. కానీ, ఇలా విడిగా గ్యాస్ ఛార్జ్ వసూలు చేయడం చట్టబద్ధం కాదని వినియోగదారుల హక్కుల నిపుణులు చెబుతున్నారు.
బిల్లులో ఇలాంటి అదనపు ఛార్జీలు కనిపిస్తే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చని సూచిస్తున్నారు. వరుసగా పెరుగుతున్న ధరలతో ఇప్పటికే సామాన్యుడు ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు గ్యాస్ క్రైసిస్ పేరుతో రెస్టారెంట్లు చేస్తున్న ఈ వసూళ్లు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. బయట హోటల్‌కు వెళ్లి దోశ తినాలన్నా ఇప్పుడు ఒకటికి రెండుసార్లు బిల్లు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.