Bichkunda: బిచ్‌కుందలో ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు డొమెస్టిక్ సిలిండర్లు సీజ్, కేసులు నమోదు

Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్‌కుంద మండల కేంద్రంలో మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.

Update: 2026-03-17 11:59 GMT

Bichkunda: బిచ్‌కుందలో ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు డొమెస్టిక్ సిలిండర్లు సీజ్, కేసులు నమోదు

బిచ్‌కుంద (కామారెడ్డి జిల్లా): కామారెడ్డి జిల్లా బిచ్‌కుంద మండల కేంద్రంలో మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా గృహ అవసరాలకు వాడే (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లను వ్యాపార అవసరాలకు వాడుతున్న హోటళ్లు, డాబాలపై అధికారులు విరుచుకుపడ్డారు.

ఏకకాలంలో హోటళ్లు, డాబాల్లో తనిఖీలు

ఎన్‌ఫోర్స్‌మెంట్ ఓఎస్‌డీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. మండల కేంద్రంలోని పలు టీ పాయింట్లు, హోటళ్లు, రోడ్డు పక్కన ఉన్న డాబాలలో డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నట్లు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ తనిఖీల్లో 16 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఓఎస్‌డీ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన 8 మంది హోటల్ యాజమానులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

గ్యాస్ ఏజెన్సీలో తనిఖీ.. నిర్వాహకులకు హెచ్చరిక

అనంతరం స్థానిక ఇండియన్ గ్యాస్ ఏజెన్సీని అధికారులు సందర్శించారు. సీజ్ చేసిన సిలిండర్లను గోదాముకు తరలించి, అక్కడి స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. గ్యాస్ పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకూడదని, గృహ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఏజెన్సీ నిర్వాహకులను హెచ్చరించారు.

ప్రజలకు విజ్ఞప్తి

రాష్ట్రవ్యాప్తంగా డొమెస్టిక్ సిలిండర్ల వినియోగంపై నిఘా ఉందని, హోటళ్లు లేదా వ్యాపార సంస్థల్లో వీటిని వాడటం చట్టరీత్యా నేరమని శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఎక్కడైనా అక్రమంగా సిలిండర్లు వాడుతున్నట్లు తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

ఈ దాడుల్లో జిల్లా అధికారులు సుదర్శన్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ సురేష్, ఖలీద్, కానిస్టేబుల్ మోబిన్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News