ACB Raids: స్నేహితుడితో గొడవ.. ఏసీబీకి చిక్కిన అవినీతి సూపరింటెండెంట్!
ACB Raid: అక్రమంగా సంపాదించిన సొమ్మును దాచుకోవడానికి స్నేహాన్ని అడ్డుపెట్టుకున్న ఓ ప్రభుత్వ అధికారి తీరా అదే స్నేహితుడితో వచ్చిన విభేదాల వల్ల కటకటాల పాలయ్యాడు.
ACB Raids: స్నేహితుడితో గొడవ.. ఏసీబీకి చిక్కిన అవినీతి సూపరింటెండెంట్!
కరీంనగర్ (తిమ్మాపూర్): అక్రమంగా సంపాదించిన సొమ్మును దాచుకోవడానికి స్నేహాన్ని అడ్డుపెట్టుకున్న ఓ ప్రభుత్వ అధికారి తీరా అదే స్నేహితుడితో వచ్చిన విభేదాల వల్ల కటకటాల పాలయ్యాడు. తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలో గల జాయింట్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న మధుసూదన్ను ఏసీబీ అధికారులు అక్రమ ఆస్తుల కేసులో అరెస్టు చేశారు.
అవినీతికి ‘ప్రైవేట్’ రూట్:
గత రెండేళ్లుగా మధుసూదన్ ఉద్యోగుల ఫైళ్లు, కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ చేయడానికి భారీగా లంచాలు డిమాండ్ చేసేవాడు. నేరుగా డబ్బులు తీసుకుంటే దొరికిపోతాననే భయంతో, తన స్నేహితుడి పేరు మీద ఒక ప్రైవేట్ బ్యాంకులో ఖాతా తెరిపించాడు. లంచం సొమ్మంతా ఆ ఖాతాలోకే జమ చేయించేవాడు.
మిత్రుడే శత్రువై.. గుట్టు విప్పాడు:
అంతా సజావుగా సాగుతుందనుకున్న తరుణంలో, ఇటీవల మధుసూదన్ కు అతని స్నేహితుడికి మధ్య ఆర్థిక పరమైన గొడవలు మొదలయ్యాయి. దీంతో కక్ష పెంచుకున్న స్నేహితుడు, మధుసూదన్ చేస్తున్న అవినీతి దందాను ఆధారాలతో సహా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారులు, మధుసూదన్ అకౌంట్ నుండి రూ. 14.77 లక్షల నగదును సీజ్ చేసి, అతడిని కార్యాలయంలోనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
ఏసీబీ అధికారుల హెచ్చరిక:
అవినీతి వల్ల పనుల నాణ్యత దెబ్బతినడమే కాకుండా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఎక్కడైనా లంచం డిమాండ్ చేస్తే వెనకడుగు వేయకుండా ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. స్నేహం పేరుతో ఇలాంటి సామాజిక ద్రోహానికి పాల్పడటం శోచనీయమని, ఆర్థిక లావాదేవీలు స్నేహానికి మచ్చ తెస్తాయని ఈ ఘటన నిరూపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.