Kondagattu Temple: కొండగట్టులో భక్తుల కష్టాలు.. ప్రసాదాలు లేక, నీళ్లు దొరకక అవస్థలు!
Kondagattu Temple: కొండగట్టు అంజన్న క్షేత్రంలో భక్తుల ఆగ్రహం! హనుమాన్ జయంతి వేళ సరైన ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారని భక్తులు మండిపడుతున్నారు.
Kondagattu Temple: కొండగట్టులో భక్తుల కష్టాలు.. ప్రసాదాలు లేక, నీళ్లు దొరకక అవస్థలు!
Kondagattu Temple: అత్యంత శక్తివంతమైన క్షేత్రంగా విరాజిల్లుతున్న కొండగట్టు అంజన్న ఆలయం వద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల వేళ తీవ్ర ఉద్రిక్తత, అసహనం వ్యక్తమవుతున్నాయి. చైత్ర పౌర్ణమి పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు మాలలు ధరించి, కాలినడకన స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. అయితే, భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో ఆలయ అధికారులు, యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముందే హెచ్చరించిన ప్రమాదం:
హనుమాన్ జయంతికి ఒక రోజు ముందే ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు కూలిపోవడం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత కూడా అధికారులు అప్రమత్తం కాకపోవడం గమనార్హం.
చుక్క నీరు లేదు.. ప్రసాదం దొరకదు:
ఎండలు మండిపోతున్న వేళ కనీసం తాగునీటి సౌకర్యం కూడా సరిగా లేదని భక్తులు వాపోతున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నా ప్రసాదాలు లభించడం లేదని, ప్రసాదాల కౌంటర్ల వద్ద భారీగా కొరత ఏర్పడిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాదాల గురించి ప్రశ్నిస్తే సిబ్బంది దురుసుగా సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భక్తుల డిమాండ్:
లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా ప్రసాదాల తయారీలో ఎందుకు నిర్లక్ష్యం వహించారని అంజన్న భక్తులు ప్రశ్నిస్తున్నారు. "స్వామివారిని దర్శించుకోవడానికి వస్తే కనీసం మంచినీళ్లు, ప్రసాదం కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. అధికారుల సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది" అని భక్తులు మండిపడుతున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.