Harish Rao: హైడ్రా డ్రైవర్ ఉద్యోగాల రగడ: రేవంత్ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం!
Harish Rao: సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్ద హైడ్రా డ్రైవర్ పోస్టుల భర్తీలో నిరుద్యోగులను అవమానించడంపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao: హైడ్రా డ్రైవర్ ఉద్యోగాల రగడ: రేవంత్ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం!
Harish Rao: సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్ద ‘హైడ్రా’ డ్రైవర్ పోస్టుల భర్తీ ప్రక్రియ సందర్భంగా అధికారుల తీరుపై నిరుద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని ఎండగడుతూ పలు ప్రశ్నలు సంధించారు.
ఎన్నికల సమయంలో అధికారం కోసం నిరుద్యోగులను నెత్తిన పెట్టుకుని హామీలు ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు ఉద్యోగాల కోసం రోడ్డుపైకి వస్తే వారిపై ఇంత కర్కశంగా వ్యవహరించడం సమంజసం కాదని మండిపడ్డారు. కేవలం 150 డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే పీజీ, పీహెచ్‌డీ వంటి ఉన్నత చదువులు చదివిన వేలాది మంది క్యూలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని దుయ్యబట్టారు.
“ఇంజనీరింగ్ విద్యార్థులను సీఎం క్రిమినల్ వేస్ట్ అని అనడం, ఉద్యోగార్థులను అధికారులు దుర్భాషలాడటం ‘యథా రాజా.. తథా అధికారులు’ అన్న సామెతను గుర్తు చేస్తోంది” అని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని, 32 నెలలు దాటినా ఆ హామీని నిలబెట్టుకోకపోవడం వల్లే నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ నెలకొందని విమర్శించారు.