Revanth Reddy : ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ.. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్
Revanth Reddy : ఢిల్లీలో నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశం జరుగనుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్, అసెంబ్లీ ఎన్నికలపై వ్యూహరచన చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహా కీలక నేతలు హాజరు కాబోతున్నారు.
Revanth Reddy
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ సందడి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) నేడు అత్యవసరంగా భేటీ కాబోతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు, రాబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీకి లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16 నుంచి నిర్వహించ తలపెట్టిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.
మహిళా రిజర్వేషన్లు
కేంద్ర కేబినెట్ ఇటీవలే మహిళా రిజర్వేషన్ల అంశానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీని ప్రకారం లోక్ సభ స్థానాలను 816 కు పెంచి, అందులో 33 శాతం (273 సీట్లు) మహిళలకు కేటాయించాలని కేంద్రం భావిస్తోంది. అయితే, ఇది 2029 ఎన్నికల నుంచి అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేవలం ఎన్నికల లబ్ధి కోసమే, ముఖ్యంగా బెంగాల్, తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ ఈ బిల్లును తెస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ (డీలిమిటేషన్) వల్ల దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గి అన్యాయం జరుగుతుందన్న ఆందోళనను జైరాం రమేష్ వంటి నేతలు వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రాల ఎన్నికల సమీక్ష
కేవలం పార్లమెంట్ వ్యవహారాలే కాకుండా, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై కూడా సీడబ్ల్యూసీ దృష్టి సారించనుంది. గురువారం జరిగిన కేరళ, పుదుచ్చేరి, అస్సాం ఎన్నికల పోలింగ్ సరళిని సమీక్షించడంతో పాటు.. ఈ నెల 23, 29 తేదీల్లో జరగబోయే పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. అలాగే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ పరిణామాలపై కూడా కాంగ్రెస్ ఒక స్టాండ్ తీసుకోనుంది.
ఢిల్లీకి క్యూ కట్టిన తెలంగాణ నేతలు
ఈ కీలక సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీకి బయలుదేరారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ కూడా వెళ్లారు. తెలంగాణతో పాటు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు కూడా ఈ భేటీలో పాల్గొని తమ రాష్ట్రాల గొంతును వినిపించనున్నారు. ముఖ్యంగా డీలిమిటేషన్ అంశంలో రాజ్యాంగ సవరణ విషయంలో కేంద్రం తొందరపడకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది.