OpenAI: ఏఐ ప్రపంచంలో కొత్త శకం..వినియోగదారుల కోసం GPT-5.4 Mini, Nano విడుదల
OpenAI: ఓపెన్ ఏఐ తన శక్తివంతమైన GPT-5.4 సిరీస్‌లో మినీ మరియు నానో వెర్షన్లను విడుదల చేసింది.
OpenAI: ఏఐ ప్రపంచంలో కొత్త శకం..వినియోగదారుల కోసం GPT-5.4 Mini, Nano విడుదల
GPT-5.4 Mini: టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఓపెన్ ఏఐ కొత్త మోడళ్ల గురించే చర్చ జరుగుతోంది. మరింత శక్తివంతమైన GPT-5.4 మోడల్‌ను విడుదల చేసిన కొద్ది వారాలకే, వేగం, పొదుపును మంత్రదండంగా మార్చుకుని మినీ , నానో వెర్షన్లను విడుదల చేసింది. ముఖ్యంగా వీటిని ఉచిత వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకురావడం విశేషం.సాధారణంగా చిన్న మోడళ్లు అంటే పనితీరులో రాజీ పడతాయని అనుకుంటాం. కానీ, GPT-5.4 మినీ విషయంలో అది తప్పు అని ఓపెన్ ఏఐ నిరూపించింది. ఇది తన మునుపటి మోడళ్ల కంటే 2 రెట్లు వేగంగా పనిచేస్తుంది. కోడింగ్, రీజనింగ్ , మల్టీమోడల్ అండర్‌స్టాండింగ్ వంటి క్లిష్టమైన పనులను కూడా చిటికెలో పూర్తి చేస్తుంది. SWE-Bench Pro వంటి కఠినమైన బెంచ్‌మార్క్‌లలో ఇది అసలైన GPT-5.4 మోడల్‌కు గట్టి పోటీని ఇస్తోందంటే దీని సామర్థ్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
అతి తక్కువ ధరకు హై-స్పీడ్ AI
ఇక డెవలపర్లు , స్టార్టప్‌ల కోసం ఓపెన్ ఏఐ నానో మోడల్‌ను పరిచయం చేసింది. ఇది GPT-5.4 సిరీస్‌లోనే అత్యంత చిన్నది , చౌకైనది. డేటా సంగ్రహణ , వర్గీకరణ, ర్యాంకింగ్ వంటి పనులకు ఇది వెన్నతో పెట్టిన విద్య. తక్కువ ఖర్చుతో ఎక్కువ వేగం కావాలనుకునే సంస్థలకు ఇది ఒక వరం లాంటిది.
సబ్-ఏజెంట్‌గా కొత్త అవతారం
ఓపెన్ ఏఐ ఈ మోడళ్లను కేవలం చాట్ బాట్‌లుగానే కాకుండా, సబ్-ఏజెంట్‌లుగా ప్రచారం చేస్తోంది. ఉదాహరణకు, ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్ తన సిస్టమ్‌ను డిజైన్ చేస్తున్నప్పుడు.. ప్రధాన GPT-5.4 మోడల్ పెద్ద ప్లానింగ్ , తుది నిర్ణయాలు తీసుకుంటే, కోడ్‌బేస్‌ను వెతకడం లేదా పెద్ద డాక్యుమెంట్‌ను స్కాన్ చేయడం వంటి చిన్న చిన్న పనులను ఈ మినీ మోడల్ వేగంగా పూర్తి చేస్తుంది. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, పనిలో ఖచ్చితత్వం పెరుగుతుంది.
ఎవరికి ఉపయోగం?
లేటెన్సీ తక్కువగా ఉండటం వల్ల యూజర్ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది అని ఓపెన్ ఏఐ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.రియల్ టైమ్‌లో కోడ్ సలహాలు ఇవ్వడానికి, స్క్రీన్‌షాట్‌లను అర్థం చేసుకుని తక్షణం స్పందించడానికి, ఫొటోలు ,టెక్స్ట్‌పై ఒకేసారి వేగంగా స్పందించడానికి ఇది ఉపయోగపడుతుంది. AI అంటే కేవలం సమాచారం ఇవ్వడమే కాదు, అది మన పనులను ఎంత వేగంగా, ఎంత చౌకగా పూర్తి చేస్తుందనేదే ముఖ్యం. ఓపెన్ ఏఐ విడుదల చేసిన ఈ GPT-5.4 మినీ , నానో మోడళ్లు ఏఐ సాంకేతికతను సామాన్యుడికి మరింత దగ్గర చేశాయి. గూగుల్, ఆంత్రోపిక్ వంటి ప్రత్యర్థి సంస్థల పోటీని తట్టుకుని నిలబడటమే కాకుండా, వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించడంలో ఓపెన్ ఏఐమరో అడుగు ముందుకేసింది.