BCCI Profit: రూ.14 కోట్ల నుంచి రూ.6280 కోట్లు.. బీసీసీఐకి 'మనీ ప్రింటింగ్ మెషిన్‌'గా ఐపీఎల్!

BCCI Profit from IPL. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి గత కొన్నేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఒక బంగారు బాతుగా మారింది.

Update: 2026-06-04 01:41 GMT

BCCI Profit: రూ.14 కోట్ల నుంచి రూ.6280 కోట్లు.. బీసీసీఐకి 'మనీ ప్రింటింగ్ మెషిన్‌'గా ఐపీఎల్!

BCCI Profit: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి గత కొన్నేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఒక బంగారు బాతుగా మారింది. 2008లో ప్రారంభమైన ఈ టోర్నీ కేవలం క్రికెట్ వినోదానికే పరిమితం కాకుండా.. ప్రపంచ క్రీడా రంగంలోనే అత్యంత విజయవంతమైన వ్యాపార నమూనాల్లో ఒకటిగా ఎదిగింది. ప్రతి ఏడాది పెరుగుతున్న ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, ఫ్రాంచైజీ ఫీజులు, ప్రకటనల ఆదాయం కారణంగా ఐపీఎల్ టోర్నీ బీసీసీఐ ఖజానాను గట్టిగానే నింపుతోంది. నివేదికల ప్రకారం 2008లో రూ.14 కోట్ల లాభం రాగా.. 2026లో ఏకంగా రూ.6280 కోట్ల లాభం వచ్చిందట.

2008లో తొలి సీజన్ సందర్భంగా ఐపీఎల్ ద్వారా సుమారు రూ.1,000 కోట్ల ఆదాయం వచ్చినప్పటికీ.. బీసీసీఐకి కేవలం రూ.14 కోట్ల లాభం మాత్రమే మిగిలింది. అయితే టోర్నీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరగడంతో ఆదాయం, లాభాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. 2010 నాటికి బీసీసీఐ లాభం రూ.112 కోట్లకు చేరుకోగా.. 2015లో అది రూ.420 కోట్లకు పెరిగింది. ఐపీఎల్ చరిత్రలో 2017 కీలక మలుపుగా నిలిచింది. కొత్త ప్రసార హక్కుల ఒప్పందాల కారణంగా ఆ ఏడాది ఆదాయం రూ.3,412 కోట్లకు ఎగబాకగా.. బీసీసీఐ లాభం రూ.1,440 కోట్లకు చేరింది. ఆ తర్వాత ప్రతి సీజన్‌లో ఆదాయం కొత్త రికార్డులు సృష్టిస్తూ వస్తోంది.

2022లో రెండు కొత్త జట్లు చేరడంతో ఐపీఎల్ విలువ మరింత పెరిగింది. ఆ ఏడాది టోర్నీ ఆదాయం రూ.6,610 కోట్లకు చేరుకోగా.. బీసీసీఐ లాభం రూ.3,727 కోట్లుగా నమోదైంది. అనంతరం భారీ మీడియా హక్కుల ఒప్పందాల ప్రభావంతో 2023లో ఆదాయం రూ.11,801 కోట్లకు చేరింది. అదే ఏడాది బీసీసీఐ రూ.5,120 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2024 సీజన్‌లో సుమారు రూ.12,006 కోట్ల ఆదాయం నమోదు కాగా.. బీసీసీఐ లాభం రూ.5,113 కోట్లుగా నిలిచింది. 2025 సీజన్‌కు సంబంధించి ఆదాయం రూ.12,450 కోట్లకు చేరుకోగా.. లాభం రూ.6,280 కోట్ల వరకు ఉంది. ఇప్పుడు ఆ మొత్తం ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

కేవలం 17 ఏళ్ల వ్యవధిలో ఐపీఎల్ ఒక దేశీయ టీ20 లీగ్ నుంచి.. ప్రపంచ క్రీడా రంగంలోనే అత్యంత విలువైన టోర్నీలలో ఒకటిగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయం అనేక దేశాల క్రికెట్ బోర్డుల వార్షిక బడ్జెట్‌లను మించిపోతుండటం విశేషం. ప్రసార హక్కులు, డిజిటల్ స్ట్రీమింగ్, స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ విక్రయాలు, ఫ్రాంచైజీ ఫీజులు వంటి పలు మార్గాల ద్వారా ఐపీఎల్ భారీ ఆదాయాన్ని సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను ప్రపంచ క్రికెట్‌లోనే అతిపెద్ద 'మనీ ప్రింటింగ్ మెషిన్'గా అభివర్ణించడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.

Tags:    

Similar News