AFG vs IND: ఆఫ్ఘనిస్తాన్‌కు చారిత్రాత్మక ఛాన్స్.. టీమిండియాకు తొలిసారి ఆతిథ్యం!

AFG vs IND: భారత్-ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ సంబంధాల్లో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.

Update: 2026-06-02 14:59 GMT

AFG vs IND: ఆఫ్ఘనిస్తాన్‌కు చారిత్రాత్మక ఛాన్స్.. టీమిండియాకు తొలిసారి ఆతిథ్యం!

AFG vs IND: భారత్-ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ సంబంధాల్లో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. నివేదికల ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తొలిసారిగా భారత జట్టుకు అధికారికంగా ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మ్యాచ్‌లు ఆఫ్ఘనిస్తాన్‌లో కాకుండా.. భారత రాజధాని ఢిల్లీలో జరగనున్నాయి. సెప్టెంబర్‌లో ఇరు భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ఢిల్లీలో మూడు టీ20 మ్యాచ్‌లు?:

ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ ఆతిథ్య హోదాలో భారత్‌తో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ నిర్వహించనుంది. ఈ మ్యాచ్‌లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 13, 16, 19 తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ఈ సిరీస్‌పై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఆఫ్ఘనిస్తాన్ గతంలో కూడా భారత్‌లోనే తన హోమ్ మ్యాచ్‌లను నిర్వహించింది. ఐర్లాండ్, బంగ్లాదేశ్ వంటి జట్లతో గ్రేటర్ నోయిడా, డెహ్రాడూన్, లక్నో వేదికలుగా మ్యాచ్‌లు ఆడింది. ఇప్పుడు భారత్‌తో సిరీస్ కూడా అదే తరహాలో జరగనుంది.

జూన్ 6 నుంచి టెస్టు, వన్డే సిరీస్:

ఇదిలా ఉంటే.. జూన్ 6 నుంచి భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఒకే ఒక్క టెస్టు మ్యాచ్‌తో పాటు మూడు వన్డేల సిరీస్ కూడా ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ముందు భారత జట్టు ప్రాక్టీస్ క్యాంప్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత జట్టు మేనేజ్‌మెంట్ జమ్మూ కశ్మీర్ యువ పేసర్ ఆకిబ్ నబీ దార్‌ను నెట్స్ బౌలర్‌గా పిలిచింది. టెస్టు జట్టులో అతనికి అవకాశం రాకపోవడంపై ఇప్పటికే విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. ఇప్పుడు టీమిండియా శిబిరంలో చోటు దక్కడం విశేషంగా మారింది. ఆకిబ్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్‌లో ఆడిన లెగ్ స్పిన్నర్ జీషాన్ అంసారీని కూడా నెట్ బౌలర్‌గా ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టులో పలువురు రిస్ట్ స్పిన్నర్లు ఉండటంతో బ్యాటర్లకు మెరుగైన ప్రాక్టీస్ అందించాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తీవ్ర వేడి వాతావరణంగా:

ఇక శివాంగ్ కుమార్ (ఎడమచేతి రిస్ట్ స్పిన్నర్), గుర్జప్నీత్ సింగ్ (ఎడమచేతి పేసర్), ఐపీఎల్ యువ సంచలనం ప్రిన్స్ యాదవ్, ఆఫ్ స్పిన్నర్ సరాంశ్ జైన్‌లను కూడా నెట్స్ బౌలర్లుగా ఎంపిక చేశారు. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. తీవ్ర వేడి వాతావరణం కారణంగా ప్రధాన పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ నెట్స్‌లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయడం సాధ్యం కావడం లేదు. గత కొన్ని రోజుల్లో వరుస మ్యాచ్‌లు, ప్రయాణాలతో వారు అలసటకు గురయ్యారు. దీంతో బ్యాటర్లకు తగిన ప్రాక్టీస్ అందించేందుకు అదనపు బౌలర్లను శిబిరంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆఫ్ఘనిస్తాన్‌కు చారిత్రాత్మక అవకాశం:

టీ20 ఫార్మాట్‌లో గత కొన్నేళ్లుగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు అద్భుత విజయాలు సాధిస్తోంది. ప్రపంచ క్రికెట్‌లో బలమైన జట్టుగా ఎదుగుతున్న ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్‌పై ఆతిథ్య సిరీస్ నిర్వహించడం ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. అధికారిక ప్రకటన వెలువడితే.. ఇది ఇరు దేశాల క్రికెట్ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచే అవకాశం ఉంది.

Tags:    

Similar News