4 గంటల్లోనే ట్రిపుల్ సెంచరీతో విధ్వంసం.. ఎవ్వరూ టచ్ చేయలేని ప్రపంచ రికార్డ్!
Cricket World Records: తరం మారినా, క్రికెట్ రూపురేఖలు మారినా కొన్ని రికార్డులు మాత్రం చెక్కుచెదరకుండా కాలంతో పాటు ప్రయాణిస్తూనే ఉంటాయి.
4 గంటల్లోనే ట్రిపుల్ సెంచరీతో విధ్వంసం.. ఎవ్వరూ టచ్ చేయలేని ప్రపంచ రికార్డ్!
Cricket World Records: క్రికెట్ చరిత్రలో ఎందరో దిగ్గజ బ్యాటర్లు మైదానంలో పరుగుల వరద పారించారు. కానీ, కేవలం 4 గంటల వ్యవధిలోనే ప్రత్యర్థి బౌలర్లను ముప్పతిప్పలు పెట్టి, దాదాపు 100 ఏళ్లు కావొస్తున్నా ఎవరికీ సాధ్యంకాని రీతిలో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీతో ప్రపంచ రికార్డు సృష్టించిన ఆ ఇంగ్లాండ్ సింహం గురించి మీకు తెలుసా?
బౌలర్లకు పీడకలగా మారిన ఆ ఇంగ్లాండ్ వీరుడు ఎవరు?
క్రికెట్ మైదానంలో బంతి పడితే చాలు స్టేడియం దాటాల్సిందే అనేలా ఆ కాలంలోనే భీభత్సం సృష్టించిన ఆ కరడుగట్టిన కుడిచేతి వాటం బ్యాటర్ పేరు 'వాలీ హమ్మండ్'. ఇంగ్లాండ్‌కు చెందిన ఈ దిగ్గజ ఆటగాడు క్రీజులోకి వస్తే చాలు ప్రత్యర్థి జట్టు బౌలర్లు లబోదిబోమనేవారు. సమయం పరంగా చూస్తే అంతర్జాతీయ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీ బాదిన ఏకైక రారాజుగా ఆయన చరిత్ర పుటల్లో నిలిచిపోయారు.
కేవలం 288 నిమిషాల్లోనే..
దాదాపు 93 సంవత్సరాల క్రితం, అంటే 1933 మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వాలీ హమ్మండ్, కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కేవలం 288 నిమిషాల (దాదాపు 4 గంటల) వ్యవధిలోనే ఆయన తన త్రిశతకాన్ని పూర్తి చేసుకున్నారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో నిమిషాల లెక్కన ఇంత వేగంగా ఏ బ్యాటర్ కూడా ఇప్పటివరకు పరుగులు చేయలేకపోయాడు.
ఊహకు అందని ఆ ఇన్నింగ్స్ విశేషాలు..
ఆ మ్యాచ్‌లో వాలీ హమ్మండ్ ఏకంగా 366 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఆయన ఆడిన ఆ విధ్వంసకర ఇన్నింగ్స్‌లో 34 ఫోర్లు, 10 భారీ సిక్సర్లు ఉన్నాయి. అప్పట్లో వన్డే, టీ20 మ్యాచ్‌లు లేకపోయినా, ఆయన ఆడిన తీరు చూస్తే నేటి తరం బౌండరీల వర్షాన్ని తలపించింది. ఈ ఇన్నింగ్స్ చూసిన ప్రత్యర్థి బౌలర్లు మైదానంలోనే ఇక తమ వల్ల కాదన్నట్లు చేతులెత్తేశారు.
ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి కేవలం 158 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఇంగ్లాండ్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో వాలీ హమ్మండ్ వీరోచిత బ్యాటింగ్ సాయంతో 7 వికెట్ల నష్టానికి 548 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసిన తరుణంలో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పరుగుల కొండ.. 50 వేలకు పైగా రన్స్..!
వాలీ హమ్మండ్ కేవలం అంతర్జాతీయ క్రికెట్లోనే కాదు, దేశవాళీ క్రికెట్‌లోనూ పరుగుల యంత్రంలా దూసుకుపోయారు. ఆయన ఇంగ్లాండ్ తరపున 85 టెస్టు మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించి 58.45 సగటుతో 7,249 పరుగులు చేశారు. ఇందులో 22 శతకాలు, 24 అర్ధశతకాలు ఉన్నాయి. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్ విషయానికి వస్తే, ఆయన కెరీర్‌లో ఏకంగా 634 మ్యాచ్‌లు ఆడి 56.10 అద్భుతమైన సగటుతో 50,551 పరుగులు సాధించారు. ఇందులో 167 సెంచరీలు, 185 హాఫ్ సెంచరీలు ఉండటం ఆయన బ్యాటింగ్ ప్రతిభకు నిదర్శనం.
తరం మారినా, క్రికెట్ రూపురేఖలు మారినా కొన్ని రికార్డులు మాత్రం చెక్కుచెదరకుండా కాలంతో పాటు ప్రయాణిస్తూనే ఉంటాయి. సాంకేతికత, ఆధునిక బ్యాట్లు లేని ఆ కాలంలోనే కేవలం 4 గంటల్లో వాలీ హమ్మండ్ సృష్టించిన ఈ సుడిగాలి ట్రిపుల్ సెంచరీ రికార్డ్, నేటి ఆధునిక క్రికెట్ యుగంలో కూడా ఎవరికీ సాధ్యం కాకుండా ఒక అజేయమైన మైలురాయిగా నిలిచిపోయింది.