Aryaman Birla-RCB: అప్పుడు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్, ఇప్పుడు ఆర్‌సీబీకి ఛైర్మన్.. ఎవరీ ఆర్యమాన్ బిర్లా!
Aryaman Birla-RCB: ఆర్‌సీబీ ఫ్రాంచైజీని ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని శక్తివంతమైన కన్సార్టియం సుసొంతం చేసుకుంది. ఈ డీల్ తర్వాత ఆర్‌సీబీ ఫ్రాంచైజీ చైర్మన్‌గా ఆర్యమన్ బిర్లా బాధ్యతలు చేపట్టనున్నారు.
Aryaman Birla
Aryaman Birla-RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ముందు రెండు భారీ డీల్ క్రికెట్ ప్రపంచంను షాక్‌కు గురిచేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీని ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని శక్తివంతమైన కన్సార్టియం సుమారు రూ.16,000 కోట్ల (సుమారు $1.78 బిలియన్)కు సొంతం చేసుకుంది. ఈ ఒప్పందం యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (డియాజియో అనుబంధ సంస్థ)తో కుదిరింది. ఈ డీల్‌లో భాగంగా ఆర్‌సీబీ పురుష జట్టుతో పాటు మహిళల జట్టు (డబ్ల్యూపీఎల్) కూడా కొత్త యాజమాన్యంలోకి వెళ్లింది.
ఆర్యమన్ బిర్లా ఎవరు?:
ఈ కన్సార్టియంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌తో పాటు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, డేవిడ్ బ్లిట్జర్‌కు చెందిన బోల్ట్ వెంచర్స్, అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ భారీ ఒప్పందంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువ మరోసారి కొత్త స్థాయికి చేరింది. ఈ డీల్ తర్వాత ఆర్‌సీబీ ఫ్రాంచైజీ చైర్మన్‌గా ఆర్యమన్ బిర్లా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగలం బిర్లా కుమారుడు.
ప్రొఫెషనల్ క్రికెటర్‌గా:
28 ఏళ్ల ఆర్యమన్ బిర్లా ఒకప్పుడు ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మైదానంలో తన ప్రతిభను చూపించారు. మధ్యప్రదేశ్ తరఫున దేశీయ క్రికెట్ ఆడిన ఆయన.. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో మంచి ప్రదర్శన చేశారు. ముఖ్యంగా బెంగాల్‌పై ఈడెన్ గార్డెన్స్‌లో సెంచరీ నమోదు చేయడం విశేషం. అంతేకాదు ఐపీఎల్ 2018 వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆయనను రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. 2020కు ముందు ఆర్యమన్ జట్టును వీడారు.
కొత్త ప్రయాణం:
క్రికెట్ కెరీర్ మధ్యలోనే ఆర్యమన్ బిర్లా వ్యక్తిగత కారణాలతో (మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా) ఆటకు విరామం ప్రకటించారు. ఆ సమయంలో తన మానసిక స్థితి గురించి సోషల్ మీడియాలో ఓపెన్‌గా పంచుకున్నారు. తర్వాత క్రికెట్‌కు తిరిగి రాకుండా.. ప్రస్తుతం ఆదిత్య బిర్లా మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.
ఆర్‌సీబీ ఆర్యమన్ వ్యాఖ్యలు:
ఆర్‌సీబీ కొనుగోలు తర్వాత ఆర్యమన్ బిర్లా స్పందిస్తూ... 'ఆర్‌సీబీ తదుపరి అభివృద్ధి దశను మేము తీర్చిదిద్దడం గర్వంగా ఉంది. ఈ భాగస్వామ్యం క్రీడలు, మీడియా, వినియోగదారుల వ్యాపారాల్లో అనుభవాన్ని కలిపి ముందుకు తీసుకెళ్తుంది' అని తెలిపారు. ఈ భారీ ఒప్పందంతో ఆర్‌సీబీ జట్టులో వ్యూహాత్మక మార్పులు, పెట్టుబడులు, గ్లోబల్ స్థాయి అభివృద్ధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ ఫ్యాన్‌బేస్ కలిగిన ఆర్‌సీబీ.. కొత్త యాజమాన్యం ఆధ్వర్యంలో మరింత బలంగా మారుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.