Hanuman Temple Offering Loans: భక్తులకు అప్పులిచ్చే ఆంజనేయుడి ఆలయ రహస్యం

Hanuman Temple Offering Loans:మనసులో అచంచలమైన భక్తి ఉంటే ఆ భగవంతుడు దారి చూపిస్తాడని పెద్దలు చెబుతారు. దారి చూపడమే కాదు... ఆ దేవుడే స్వయంగా పరిష్కారం కూడా చూపిస్తాడని మధ్యప్రదేశ్‌లోని ఓ హనుమాన్‌ దేవాలయం నిరూపిస్తోంది.

Update: 2026-04-08 08:17 GMT

Hanuman Temple Offering Loans

Hanuman Temple Offering Loans: మనసులో అచంచలమైన భక్తి ఉంటే ఆ భగవంతుడు దారి చూపిస్తాడని పెద్దలు చెబుతారు. దారి చూపడమే కాదు... ఆ దేవుడే స్వయంగా పరిష్కారం కూడా చూపిస్తాడని మధ్యప్రదేశ్‌లోని ఓ హనుమాన్‌ దేవాలయం నిరూపిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ఇక్కడి ఆంజనేయుడు అప్పులు ఇస్తాడన్న నమ్మకం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా దీని వెనుక విశేషమైన భక్తి, సమూహ శక్తి, ధర్మబద్దమైన ఆచరణ దాగి ఉంది.

అప్పులిచ్చే దేవుడు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాం జిల్లా, బిబడోడ్ అనే చిన్న గ్రామంలో వెలసిన ఈ హనుమాన్ ఆలయం సాధారణ దేవాలయం కాదు. కొన్ని సంవత్సరాల క్రితం గ్రామస్థులందరూ కలిసి, తమ శక్తి మేరకు విరాళాలు సమకూర్చి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఒక్కొక్కరు రూ.100 నుంచి రూ.10,000 వరకు తమకు చేతనైనంత సాయం చేశారు. ఈ సమూహ కృషి ఫలితంగా దేవాలయం నిర్మాణం పూర్తయ్యింది. ఆలయం నిర్మాణం పూర్తైన తరువాత భక్తులంతా కలిసి ఓ మహాయాగాన్ని నిర్వహించారు. ఈ యాగానికి గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. భారీగా విరాళాలు సమర్పించారు. లక్షల్లో విరాళాలు పోగయ్యాయి. యాగం పూర్తయ్యాక మిగిలిన డబ్బును ఎలా వినియోగించాలన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అప్పుడే ఆలయ ధర్మకర్తలు ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు.

విరాళాల రూపంలో వచ్చిన ధనాన్ని నిల్వ ఉంచకుండా, గ్రామంలోని చిన్న వ్యాపారులు, కూలీలు, రైతులకు రుణాలుగా ఇవ్వడం ప్రారంభించారు. మొదట రూ.5,000 నుంచి రూ.20,000 వరకు చిన్న మొత్తాల్లో అప్పులు ఇచ్చారు. ఆశ్చర్యకరంగా, ఆ ధనంతో వ్యాపారం చేసిన వారు లాభాలు పొందడం ప్రారంభించారు. కొందరు కిరాణా దుకాణాలు పెట్టగా, మరికొందరు పాలు, కూరగాయల వ్యాపారం మొదలుపెట్టారు. చాలా మంది 3 నుంచి 6 నెలల్లోనే అప్పులు తిరిగి చెల్లించారు.

కష్టాలు - నష్టాల నుంచి విముక్తి

హనుమ ఇచ్చిన ధనంతో వ్యాపారం చేస్తే నష్టాలు రావని, కష్టాలు తొలగిపోతాయనే నమ్మకం ప్రజల్లో కలిగింది. తీసుకున్నవాళ్లు సకాలంలోనే తిరిగి చెల్లించడంతో పెద్దమొత్తంలో ధనం సమకూరింది. దీంతో ధర్మకర్తలు నమ్మకమైన, అవసరమైన వారికి పెద్ద మొత్తంలో ధనం రుణంగా ఇవ్వడం మొదలుపెట్టారు. రూ. 50 వేల నుంచి 2 లక్షల వరకు రుణం తీసుకుంటారు. కొంతమంది అసలు మాత్రమే తిరిగి ఇచ్చేస్తే..స్వామి కృపతో ఆనందంగా ఉన్నామని భావించేవారు అసలుతో పాటు వడ్డీకూడా ఇస్తున్నారు. ఇలా వచ్చిన వడ్డీతో స్వామివారి నిత్య కైంకర్యాలు, అన్నదానాలు నిర్వహిస్తున్నారు.

విశేష ప్రాచూర్యం

ఈ విషయం ఇతర ప్రాంతాలకు పాకింది. హనుమయ్యను దర్శించుకునేందుకు సమీప ప్రాంతాల నుంచి పట్టణాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. కొంతమంది స్వామి వారి నుంచి రుణం పొందితే...మరికొందరు స్వామిని దర్శించుకొని తరిస్తున్నారు. ఇలా స్వామివారి నుంచి అప్పు తీసుకున్నవారెవ్వరూ నష్టపోకపోవడం విశేషం. ఇదే విశ్వాసం ఇప్పుడు ఆ ప్రాంతంలో బలంగా వ్యాపించింది. రుణాలు తీసుకున్నవారు...ఎవరూ కూడా ఎగవేత చేసిన దాఖలాలు లేవు. రుణాలను తిరిగి చెల్లించడం భక్తులు ధర్మంగా భావిస్తారు. అదే ఈ వ్యవస్థను నిలబెట్టింది. భగవంతుడు కేవలం ప్రార్థనలకు మాత్రమే పరిమితం కాదని, అవసరమైనప్పుడు మార్గం చూపించే శక్తి అని ఈ ఆలయం నిరూపిస్తోంది. భక్తి, నమ్మకం, సమూహ సహకారం కలిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందనే సందేశాన్ని ఈ ఆంజనేయస్వామి క్షేత్రం స్పష్టంగా తెలియజేస్తోంది.

Tags:    

Similar News