ఈ గుడిలో ప్రసాదంగా పాస్తా, పిజ్జాలు...కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు
Chinese Kali Temple: సాధారణంగా మనం గుడికి వెళ్తే అక్కడ ప్రసాదంగా లడ్డూ లేదా పులిహోరా లేదా చక్కర పొంగలిని ఇస్తారు.
China Kali Bari Temple
Chinese Kali Temple: సాధారణంగా మనం గుడికి వెళ్తే అక్కడ ప్రసాదంగా లడ్డూ లేదా పులిహోరా లేదా చక్కర పొంగలిని ఇస్తారు. దేవాలయం అనగానే మనకు ప్రసాదంగా ఇవే గుర్తుకు వస్తాయి. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఆలయానికి వెళ్తే సాధారణ ప్రసాదాలు దొరకవు. అక్కడ అంతా భిన్నంగా ఉంటుంది. ప్రసాదంగా మనకు పాస్తా, పిజ్జా, నూడిల్స్, మోమోస్ వంటి వాటిని ఇస్తారు.
చైనీస్ కాళీకాదేవి ఆలయం
ఇలా మనకు వింత వింతైన ప్రసాదాలను అందించే ఆలయం పేరు చైనా కాళి బారి. ఇది కోల్‌కతాలోని టోంగ్రా ప్రాంతంలో ఉంది. ఇక్కడ చైనా నుంచి వలస వచ్చిన ప్రజలు టోంగ్రా ప్రాంతంలో స్థిరపడ్డారు. ఈ ప్రదేశాన్ని చైనా టౌన్ అనికూడా పిలుస్తారు. దశాబ్దాల క్రితం చైనా నుంచి ఇక్కడికి వచ్చి, తమ జీవన విధానాన్ని కొనసాగిస్తూనే స్థానిక బెంగాలీ సంస్కృతిని కూడా తమ జీవనంలో భాగం చేసుకున్నారు. ఇఅలా వారి సంప్రదాయం, ఇక్కడి భక్తి కలిసి ఈ ప్రత్యేక ఆలయం రూపుదిద్దుకుంది.
నైవేద్యం
Chinese Kali Temple Prasad చైనీయులు సాధారణంగా చౌమీన్, సూప్, మోమోస్, పిజ్జా, నూడిల్స్ వంటి వాటిని ఇష్టపడతారు. ఇలా వారికి ఇష్టమైన ఆహారాన్నే అమ్మవారికి సమర్పిస్తారు. పూజానంతరం ఈ ప్రసాదాలను భక్తులకు పంచిపెడతారు. తమ ఆహార సంస్కృతిని అమ్మవారికి సమర్పించే విధానాన్ని ఇక్కడ స్థిరపడిన చైనీయులు చాలా గొప్పగా చెప్పుకుంటారు. భక్తి భాషకు హద్దులు లేవని అంటారు. అయితే, పూజా విధానం మాత్రం హిందూ సంప్రదాయంలో జరుగుతుంది. ఆగమశాస్త్ర పద్దతుల్లోనే పూజలు జరుగుతాయి. ఈ చైనాకాళి అమ్మవారి ఆలయంలో మహాశివుడి విగ్రహం కూడా ఉంటుంది. ప్రతీరోజూ మంత్రోచ్చారణలు, హారతులు, ధూపదీప నైవేద్యాలు జరుగుతాయి. ఆహారం మారినా ఆరాధనలో మార్పులేదని ఈ ఆలయం మనకు తెలియజేస్తుంది.
పర్యాటక కేంద్రం
ఈ ఆలయం కొలువై ఉన్న చైనా టౌన్ ప్రాంతం ప్రస్తుతం ఓ పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏడాది వేలాదిమంది భక్తులు, పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. ముఖ్యంగా విదేశీయులు ఎక్కువగా ఈ ప్రాంతానికి వచ్చి అమ్మవారిని సందర్శించుకుంటారు. విశేషమేమంటే అమ్మవారికి సమర్పించిన తరువాత తీసుకునే ప్రసాదం మిగతా వాటికంటే భిన్నంగా ఉంటుంది. రుచిలో చాలా తేడా ఉంటుందని, అమ్మవారికి నివేదించిన ప్రసాదం రుచి అద్భుతంగా ఉంటుందని భక్తులు చెబుతారు. అమ్మవారిని దర్శించుకున్న తరువాత పర్యాటకులు ఇండో చైనీస్ వంటకాలను ఆస్వాదించడం ఇక్కడ ఓ సంప్రదాయంగా మారింది. మొత్తంగా చూసుకుంటే మన దేశ సంస్కృతిలో భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పడానికి నిలువెత్తు ఉదాహరణ ఈ చైనాకాళి అమ్మవారి ఆలయం. భక్తి ఎక్కడైనా ఒక్కటే..మారేది రూపం మాత్రమే అని గుర్తుంచుకుంటే చాలు.