భోజనానికి పిలిచి హత్య.. తల నరికి పూజ గదిలో దాచిన కిరాతకుడు
Odisha: ఒడిశాలోని బొలాంగీర్ జిల్లాలో భోజనానికి పిలిచి ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. తలను నరికి పూజా గదిలో దాచిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
భోజనానికి పిలిచి హత్య.. తల నరికి పూజ గదిలో దాచిన కిరాతకుడు
Odisha: మూఢనమ్మకాలు, తంత్ర-మంత్ర పూజల అనుమానంతో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసి, తలను నరికి ఇంట్లోని పూజా గదిలో దాచిన దిగ్భ్రాంతికర సంఘటన ఒడిశాలోని బొలాంగీర్ జిల్లాలో వెలుగుచూసింది.
దేవ్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బగ్దా గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతుడిని తెబడముండా గ్రామానికి చెందిన సంతోష్ ఖార్సెల్ (40)గా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శత్రుఘ్న సాహూతో పాటు అతడికి సహకరించిన మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. ప్రధాన నిందితుడు శత్రుఘ్న సాహూ ఆగస్టు 18న సంతోష్‌ను భోజనానికి తన ఇంటికి పిలిచాడు. సంతోష్ నిద్రపోయిన తర్వాత సాహూ, అతడి సహచరులు కలిసి పదునైన ఆయుధంతో దాడి చేసి నరికి చంపారు. అనంతరం మృతదేహాన్ని గ్రామం వెలుపల ఉన్న చెరువులో పడేసి, తెగిపోయిన తలను మాత్రం సాహూ తన ఇంట్లోని పూజా గదిలో దాచాడు. స్థానికులు చెరువులో తల లేని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
బాధితుడు చివరగా సాహూతో కనిపించాడనే సమాచారంతో పోలీసులు అతడి ఇంటికి వెళ్లగా, సాహూ అక్కడ ధ్యానం చేస్తూ కనిపించాడు. తొలుత మద్యం గొడవ అని నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ, తీవ్ర విచారణలో పూజా గదిలో తల దాచినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు చూపించిన ప్రదేశం నుంచి తలను, రక్తంతో తడిసిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సాహూ భార్య గత పదేళ్లుగా పిల్లలతో విడిగా ఉంటోంది. ఆమెను తిరిగి రప్పించుకునేందుకు నరబలి ఇచ్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేపట్టి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.