Terror Module : దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. టెలిగ్రామ్ గ్రూపులతో నెట్‌వర్క్.. యువతను రెచ్చగొట్టి దాడులకు ప్లాన్

Terror Module : పాకిస్థాన్ హ్యాండ్లర్ల ఆదేశాలతో భారత్‌లో దాడులకు ప్లాన్ చేసిన సాకిబ్ నెట్‌వర్క్‌ను ఏటీఎస్ ఛేదించింది. టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు విచారణలో తేలింది.

Update: 2026-04-07 02:01 GMT

Terror Module

Terror Module : దేశంలో మరో భారీ ఉగ్రకుట్రను ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ భగ్నం చేసింది. పాకిస్థాన్ హ్యాండ్లర్ల కనుసన్నల్లో భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేసిన సాకిబ్ అనే ఉగ్రవాది నెట్‌వర్క్‌ను అధికారులు ఛేదించారు. సోషల్ మీడియా ద్వారా యువతను రెచ్చగొట్టి, వారిని ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు సాకిబ్ వేసిన స్కెచ్‌ను ఏటీఎస్ బయటపెట్టింది. ప్రస్తుతం నిందితులందరూ పోలీసుల కస్టడీలో ఉండగా, విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఉగ్రవాది సాకిబ్ తన నెట్‌వర్క్‌ను విస్తరించడానికి టెలిగ్రామ్ యాప్‌ను ప్రధానంగా వాడుకున్నాడని ఏటీఎస్ విచారణలో తేలింది. అతడు డజనుకు పైగా సీక్రెట్ టెలిగ్రామ్ గ్రూపులను క్రియేట్ చేసి, వాటిలో యూపీ, ఢిల్లీ, హర్యానా, ముంబై ప్రాంతాలకు చెందిన వందలాది మంది యువకులను చేర్చాడు. ఈ గ్రూపుల్లో నిరంతరం రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులను షేర్ చేసేవాడు. యువతను మెంటల్‌గా ప్రిపేర్ చేసి, వారిని దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉసిగొల్పడమే సాకిబ్ అసలు లక్ష్యం.

దుబాయ్ టు పాకిస్థాన్.. సాకిబ్ లింకులు ఇవే

ఏప్రిల్ 2వ తేదీన మీరట్‌కు చెందిన సాకిబ్, అర్బాబ్‌తో పాటు గౌతమ్ బుద్ధ నగర్‌కు చెందిన లోకేష్, వికాస్‌లను ఏటీఎస్ అరెస్ట్ చేసింది. వీరి వెనుక ఉన్న అసలు సూత్రధారి దుబాయ్‌లో ఉన్న ఆకిబ్ అని విచారణలో తేలింది. ఆకిబ్ సహాయంతోనే సాకిబ్‌కు పాకిస్థానీ హ్యాండ్లర్లతో పరిచయం ఏర్పడింది. వారితో నేరుగా టచ్‌లో ఉంటూ, భారత్‌లోని వివిధ జిల్లాల్లో చిన్న చిన్న టీమ్స్ తయారుచేసే బాధ్యతను సాకిబ్ తీసుకున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ విధ్వంసం సృష్టించాలనేది వీరి ప్రధాన వ్యూహం.

పంజాబ్ స్మగ్లర్లతో సంబంధాలు.. ఫైరింగ్ ప్రాక్టీస్

విచారణలో మరో భయంకరమైన విషయం బయటపడింది. సాకిబ్ పంజాబ్‌కు చెందిన ఆయుధ స్మగ్లర్లతో నిరంతరం టచ్‌లో ఉన్నాడు. వారి ద్వారా భారీగా మారణాయుధాలను సేకరించి, తన టీమ్ సభ్యులకు పంపిణీ చేయాలని ప్లాన్ చేశాడు. ఇప్పటికే సాకిబ్ రహస్య ప్రాంతాల్లో ఫైరింగ్ ప్రాక్టీస్ కూడా చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలను అధికారులు అతడి మొబైల్ ఫోన్ నుండి సేకరించారు. ఆయుధ సరఫరా చేసే స్మగ్లర్ల కోసం ఇప్పుడు ఏటీఎస్ బృందాలు గాలిస్తున్నాయి.

పాత ఉగ్రదాడుల వీడియోలతో బ్రెయిన్ వాష్

నిందితుల మొబైల్ ఫోన్లలో గతంలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి, ఢిల్లీ పేలుళ్లకు సంబంధించిన వీడియోలు లభ్యమయ్యాయి. ఈ వీడియోలను గ్రూపుల్లోని సభ్యులకు పంపి, "మనం కూడా ఇలాంటి దాడులే చేయాలి" అని సాకిబ్ వారిని ప్రేరేపించేవాడు. గ్రూపుల్లోని సభ్యులందరి వివరాలను ఏటీఎస్ ఇప్పుడు సేకరిస్తోంది. ఎవరెవరు సాకిబ్ మాటలు విని ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యారో వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వడం లేదా అరెస్ట్ చేయడం వంటి చర్యలు తీసుకోనున్నారు. నిందితుల రిమాండ్ మరో మూడు రోజులు ఉండటంతో మరిన్ని కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంది.

Tags:    

Similar News