Lockup Death Case: లాకప్ డెత్ కేసు.. ఏకంగా 9 మంది పోలీసులకు మరణశిక్షలు!

Lockup Death Case: మధురై జిల్లా కోర్టు చారిత్రాత్మకమైన.. సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. కరోనా సమయంలో జరిగిన లాకప్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది.

Update: 2026-04-06 16:53 GMT

Lockup Death Case

Lockup Death Case: లాకప్ డెత్ కేసులు లెక్క తేలడం చాలా కష్టం. సాధారణంగా ఇలాంటి కేసులు రెండు మూడేళ్ళ తరువాత అటూ ఇటూగా మాఫీ అయిపోవడమో.. జనం మర్చిపోవడం.. మీడియా దృష్టి నుంచి పక్కకు జరిగిపోవడం జరుగుతుంది. కానీ, తమిళనాడులో మాత్రం ఒక లాకప్ డెత్ కేసు సంచలనంగా నిలిచింది. ఆ కేసు సీబీఐ విచారణకు వెళ్ళింది. విచారణ తరువాత ఇప్పుడు కోర్టు ఆ కేసులో ఉన్న పోలీసులకు శిక్షలు ఖరారు చేసింది. కోర్టు తీర్పు సంచలనంగా మారింది. చరిత్రలో ఇప్పటివరకూ దేశంలోనే ఎక్కడా కూడా లాకప్ డెత్ కేసులో ఇన్ని మరణశిక్షలు పడలేదు. అంతేకాదు.. మరణ శిక్ష అనేది చాలా అరుదుగా వేసే శిక్ష. రేర్ ఆఫ్ ది రేర్ కేసుగా దీనిని కోర్టు పరిగణించింది. విధులలో తప్పడుగా వ్యవహరించే వారికి ఈ తీర్పు ఒక హెచ్చరికగా భావించవచ్చు. కోర్టు తీర్పు వివరాలు ఇవే..

కరోనా సమయంలో..

కరోనా సమయంలో.. అంటే 2020సంవత్సరంలో రాత్రిపూట దుకాణం తెరిచి ఉంచారనే కారణంతో, తూత్తుకుడి జిల్లాలోని సాతన్‌కుళంలో దుకాణ యజమాని జయరాజ్, అతని కుమారుడు బెన్నిక్స్‌లను సాతన్‌కుళం పోలీసులు దారుణంగా కొట్టి చంపారు . ఈ ఘటన దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. దీనిపై సీబీఐ సమగ్ర దర్యాప్తు జరిపి, మదురై జిల్లా కోర్టుకు 2,427 పేజీల ఛార్జిషీట్‌ను సమర్పించింది. దాని ఆధారంగా, తండ్రీకొడుకుల లాకప్ మరణ కేసులో అరెస్టు అయిన 9 మంది పోలీసు అధికారులందరూ దోషులుగా తేలారు. ఈ నేపథ్యంలో, వారి శిక్షకు సంబంధించిన వివరాలను ఈరోజు, సోమవారం (ఏప్రిల్ 6) విడుదల చేశారు.

ఇన్‌స్పెక్టర్‌తో సహా 9 మందికి మరణశిక్ష..

కోర్టు తీర్పు ప్రకారం..

  • మొదటి నిందితుడైన ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌తో సహా 9 మంది పోలీసులకు జడ్జి ముత్తుకుమారన్ మరణశిక్ష విధించారు. ఇందులో, ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌కు రూ. 15 లక్షల జరిమానా విధించారు. మొదటి నిందితుడైన ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌కు రెండు మరణశిక్షలు, 7 సంవత్సరాల జైలు శిక్ష, మరియు రూ. 84.10 లక్షల జరిమానా విధించారు.
  • రెండవ నిందితుడైన సబ్-ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణన్‌కు రెండు మరణశిక్షలు, 7 సంవత్సరాల జైలు శిక్ష, ఒక సంవత్సరం జైలు శిక్ష, మరియు రూ. 84.10 లక్షల జరిమానా విధించారు.
  • మూడవ నిందితుడైన సబ్-ఇన్‌స్పెక్టర్ రఘు గణేష్‌కు రెండు మరణశిక్షలు, రెండు 7 సంవత్సరాల జైలు శిక్షలు, ఒక 3 సంవత్సరాల జైలు శిక్ష, ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ. 52 లక్షల జరిమానా విధించారు.
  • నాల్గవ నిందితుడైన హెడ్ కానిస్టేబుల్ మురుగన్‌కు రెండు మరణశిక్షలు, ఒక సెక్షన్‌లో 7 సంవత్సరాల జైలు శిక్ష, మరో సెక్షన్‌లో ఒక సంవత్సరం జైలు శిక్ష, ఇంకో సెక్షన్‌లో 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 50 లక్షల జరిమానా విధించారు.
  • ఐదో నిందితుడైన సమీదురైకి రెండు మరణశిక్షలు, ఒక సెక్షన్ కింద 7 సంవత్సరాల జైలు శిక్ష, మరో సెక్షన్‌లో ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ. 2.25 లక్షల జరిమానా విధించారు.
  • ఆరో నిందితుడైన హెడ్ కానిస్టేబుల్ ముత్తురాజ్‌కు రెండు మరణశిక్షలు, 2 సెక్షన్ల కింద 7 సంవత్సరాల జైలు శిక్ష, ఒక సెక్షన్‌లో 3 సంవత్సరాల జైలు శిక్ష, ఒక సెక్షన్‌లో ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ. 32 లక్షల జరిమానా విధించారు.
  • ఏడో నిందితుడైన కానిస్టేబుల్ సెల్లాదురైకి రెండు మరణశిక్షలు, ఒక సెక్షన్‌లో 7 సంవత్సరాల జైలు శిక్ష, మరో సెక్షన్‌లో ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు.
  • ఎనిమిదో దోషి కానిస్టేబుల్ థామస్ ఫ్రాన్స్‌కు రెండు మరణశిక్షలు, 7 సంవత్సరాల జైలు శిక్ష, ఒక సంవత్సరం జైలు శిక్ష, 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు రూ. 40.46 లక్షల జరిమానా విధించారు.
  • తొమ్మిదో దోషి కానిస్టేబుల్ వేలముత్‌కు రెండు మరణశిక్షలు, 7 సంవత్సరాల జైలు శిక్ష, చట్టంలోని ఒక సెక్షన్ కింద ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు.
  • వీరితోపాటు. కేసుతో సంబంధం ఉన్న మరో దోషి, పాల్ దురై, ఇప్పటికే మరణించినందున అతనికి శిక్ష విధించలేదు.

ఇప్పుడు కోర్టు విధించిన ఈ శిక్షలు సంచలనంగా మారాయి. ఒక లాకప్ డెత్ కేసులో ఇంతమంది పోలీసులకు.. ఒకేసారి ఇలాంటి మరణశిక్షలు పడడం గతంలో ఎప్పుడూ జరిగిన దాఖలాలు లేవని నిపుణులు అంటున్నారు.

Tags:    

Similar News