Gajuwaka Mounika Case: అందుకే.. మౌనికను పాశవికంగా అంతమొందించాడు..
Gajuwaka Mounika Case: గాజువాకలో మౌనిక అనే యువతిని క్రూరంగా హతమార్చిన కేసులో సంచలన నిజాలు బయటకు వచ్చాయి.
Gajuwaka Mounika Case
Gajuwaka Mounika Case: జీవితంలో సరదా కోసం చేసే చిన్న చిన్న తప్పిదాలు.. ప్రాణాలను ఎలా తీస్తాయో.. నేరస్థులుగా ఎలా మారుస్తాయో చెప్పే సంఘటన ఇది. విశాఖాపటం గాజువాక ప్రాంతంలో మౌనిక అనే అమ్మాయిని పాశవికంగా హత్య చేసి.. శరీరాన్ని ముక్కలుగా నరికేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన కేసు ఆదివారం నుంచి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాలు మరింత షాకింగ్ గా ఉన్నాయి. నిందితుడు హతురాలిని అడ్డు తొలగించుకోవడం కోసమే చంపేశాడనే విషయం ఈ వివరాలతో స్పష్టం అయింది. పోలీసులు చెబుతున్నదాని ప్రకారం అసలేమయ్యిందంటే..
డేటింగ్ యాప్ లో పరిచయం..
మౌనిక (31) విశాఖపట్నం, తాటిచెట్లపాలెం సంజీవయ్య కాలనీలో తల్లిదండ్రులతో ఉంటోంది. నిందితుడు చింతాడ రవీంద్ర విశాఖ నేవీలో ప్రెట్టీ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. గాజువాక ఎల్వీనగర్ లోని ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు. వీరిద్దరికీ 2021లో ఆన్ లైన్ డేటింగ్ యాప్ (Mingle App) ద్వారా పరిచయం అయింది. ఆ పరిచయం చాలా దూరం వెళ్ళింది. డేటింగ్ పేరుతో మౌనికను మోసం చేశాడు రవీంద్ర.
పెళ్లి తరువాత కూడా..
ఈ క్రమంలో నిందితునికి 2024లో పెళ్లి అయింది. అయినప్పటికీ, మౌనికతో రిలేషన్షిప్ కొనసాగించాడు. మాయమాటలతో ఆమెతో గుట్టుగా వ్యవహారం నడిపిస్తూ వచ్చాడు. ఇటీవల అతని భార్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళింది. ఆ తరువాత మరింతగా ఇద్దరి మధ్యలో రిలేషన్ కొనసాగుతూ వచ్చింది. అయితే ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయి. దీంతో ఆమెను ఎలా అయినా అడ్డు తొలగించుకోవాలని నిందితుడు భావించాడు.
ఇంటికి పిలిచి..
ఈ క్రమంలో మౌనికను తన ఇంటికి పిలిచాడు నిందితుడు. అక్కడ ఈ ఇద్దరి మధ్యలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆమెను అడ్డు తొలగించుకోవాలనే ఆలోచనతో ఉన్న నిందితుడు ఆదివారం మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో ఆమెను బలవంతంగా ముక్కు, నోరు మూసి చంపేశాడు.
శవాన్ని మాయం చేయాలని..
తరువాత ఆమె శవం ఎలా దొరక్కుండా చేయాలా అని ఆలోచించాడు. ముందుగా ఆమె శరీరం నుంచి తల, చేతులు, కాళ్ళు ముక్కలుగా నరికాడు. తల, చేతులు ఒక పాలిథిన్ బ్యాగ్ లో మూటకట్టాడు. మిగిలిన శరీర భాగాలను ఫ్రిడ్జ్ లో ఉంచాడు. తరువాత తల, చేతులు ఉన్న పాలిథిన్ కవర్ ను తీసుకుని అడవివరం, దారపాలెం ప్రాంతంలో ఉన్న ఒక నిర్జన ప్రదేశంలో పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. అనంతరం ఇంటికి వచ్చి ఇంటిలోని రక్తపు మరకలను శుభ్రం చేశాడు.
ఏమి చేయాలో అర్ధం కాక..
ఇంతవరకూ కథ బాగానే నడిపిన నిందితుడు.. మిగిలిన శరీరభాగాలు ఎలా డిస్పోజ్ చేయాలో అర్ధంకాక.. దొరికిపోతానేమో అనే భయంతో సోమవారం గాజువాక పోలీస్ స్టేషన్ లో సీఐ ముందు లొంగిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
పంచనామా..
పోలీసులు నిందితుని ఇంటి నుంచి మౌనిక మిగిలిన శరీర భాగాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టంకు పంపించారు. నిందితుని మధ్యవర్తుల సమక్షంలో విచారించగా తన నేరాన్ని ఒప్పుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.
పక్కా ఆధారాలతో..
ఈ కేసు విషయంలో అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని, పక్కా ఆధారాలతో కేసు ఇన్వెస్ట్ గేట్ చేసి నిందితునికి కఠిన శిక్షపడేలా చేస్తామని పోలీసులు చెబుతున్నారు. డేటింగ్ యాప్ లను వినియోగించవద్దని, వాటివలన ఇలాంటి దారుణాలే చోటు చేసుకుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మొత్తమ్మీద డేటింగ్ యాప్ ల ద్వారా పరిచయం ఒక యువతి ప్రాణాలను బలిగొంది. ఒక యువకుడిని క్రూరమైన నేరస్తుడిగా చేసింది. ఈ కేసు ప్రస్తుతం సమాజంలో యువతీ, యువకులకు డేటింగ్ యాప్స్ తీసుకువస్తున్న పెద్ద ముప్పును సూచిస్తోంది. సరదా కోసం ఇలాంటి డేటింగ్ యాప్స్ నుంచి పరిచయాలు పెంచుకుని.. చివరకు ఎలాంటి పరిస్థితికి వెళ్లాల్సి వస్తుందో ఈ ఘటన తెలియచేస్తోంది. దీనిని ఒక హెచ్చరికగా తీసుకోవాలని మానసిక నిపుణులు చెబుతున్నారు.