Isha Yoga: ఇషా యోగా కేంద్రంలో భారత సైనిక సిబ్బందికి హఠ యోగ శిక్షణ
Isha Yoga: ఇషా యోగా కేంద్రంలో హఠ యోగ కు సంబంధించిన శిక్షణా కార్యక్రమం జరిగింది. ఇందులో భారత భద్రతా దళాల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు.
Isha Yoga
Isha Yoga: సద్గురు గురుకులం ఆధ్వర్యంలో భారత భద్రతా దళాల కోసం నిర్వహించిన "ట్రెయిన్ ది ట్రైనర్"ఈరోజు ఈషా యోగా సెంటర్‌లో ముగిసింది. ఈ శిక్షణలో మొత్తం 99 మంది భద్రతా దళాల సిబ్బంది పాల్గొన్నారు. వీరిలో 78 మంది భారత నావికాదళానికి చెందినవారు కాగా, 21 మంది భారత సైన్యానికి చెందినవారు . ఈ కఠోర శిక్షణను పూర్తి చేసిన తర్వాత, తమ స్థావరాలలోని ఇతర సైనికులకు ఈ యోగాసనాలను నేర్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు.
మార్చి 23 నుండి ఏప్రిల్ 6 వరకు జరిగిన ఈ శిక్షణలో ఉప యోగ, సూర్య క్రియ, అంగమర్దన, ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్‌లైన్ వంటి సాంప్రదాయ యోగా పద్ధతులలో లోతైన బోధనా శిక్షణ ఇచ్చారు. శారీరక పరివర్తన, అంతర్గత సమతుల్యత, ఈ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకునే సామర్థ్యంపై ఈ శిక్షణ దృష్టి సారించింది.
ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
దేశాన్ని రక్షించే భద్రతా దళాలకు సాంప్రదాయ హఠ యోగ జ్ఞానాన్ని అందించాలన్న సద్గురు దార్శనికతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది. ఈ శిక్షణలో పాల్గొన్న అధికారులు, యోగాను ఒక శక్తివంతమైన అంతర్గత సాంకేతికతగా అనుభవించడానికి ఈ శిక్షణ తమకు సహాయపడిందని చెప్పారు. ఇది శారీరక ఓర్పును, మానసిక స్పష్టతను, భావోద్వేగ సమతుల్యతను మెరుగుపరుస్తుంది.
భారత నావికాదళంలో కెప్టెన్ గా ఉన్న శ్రీకాంత్ జోషి మాట్లాడుతూ, “ఈ హఠ యోగ ఉపాధ్యాయ శిక్షణ మూడు ప్రధాన ప్రయోజనాలను అందిస్తుంది: శారీరక బలం, మానసిక ప్రశాంతత, ఆత్మశోధన. ఈ అంతర్గత ప్రశాంతతను పెంపొందించుకుంటే, పరిస్థితులను స్పష్టంగా గ్రహించి, ఒత్తిడితో కూడిన పరిస్థితులలో కూడా ప్రశాంతంగా వ్యవహరించవచ్చు.” అని చెప్పారు. ఈ శిక్షణ తమ యూనిట్లలోని చాలా మందికి ఈ యోగ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక అవకాశాన్ని కల్పించిందని ఆయన తెలిపారు.
కమాండర్ రాహుల్ జైస్వాల్ మాట్లాడుతూ, “యోగా నిజమైన అర్థం బయట చూడటం కాదు, మన అంతరాత్మను పరిశీలించడం. మనం నేర్చుకోవాల్సింది ‘అంతర్గత ఇంజనీరింగ్’.” ఈ సాధన మనల్ని మనం బాగా అర్థం చేసుకోవడానికి, ఒత్తిడిని నియంత్రించుకోవడానికి సహాయపడుతుందని అన్నారు.
యోగా తరగతులతో పాటు, పాల్గొన్నవారు ఈశా విద్యా పాఠశాలను కూడా సందర్శించారు. వారు ఆశ్రమాన్ని కూడా సందర్శించి, ధ్యాన లింగం, లింగ భైరవి దేవి, తీర్థ కుండాల వద్ద సమయం గడిపారు. కృతజ్ఞతకు గుర్తుగా, పాల్గొన్నవారు భిక్షా హాల్‌లో భక్తులకు అన్నదానం చేశారు.
తన మరపురాని అనుభవాన్ని పంచుకుంటూ శ్రీకాంత్ జోషి ఇలా అన్నారు. “ఇషా సెంటర్‌లో నాకు లభించిన సంరక్షణకు కృతజ్ఞతగా, ఆహారాన్ని దానం చేసే అవకాశం నాకు లభించింది. ఇతరులకు ఆహారం అందించిన అనుభవం నాకు మాటల్లో వర్ణించలేని ఆనందాన్ని, అనుబంధాన్ని ఇచ్చింది.”