Basmati Rice Exports: బాస్మతీ ఎగుమతులకు బ్రేక్.. భారత్ కష్టాన్ని క్యాష్ చేసుకుంటున్న పాకిస్థాన్?
Basmati Rice Exports: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత బాస్మతీ రైతులపై కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి.
Basmati Rice Exports: బాస్మతీ ఎగుమతులకు బ్రేక్.. భారత్ కష్టాన్ని క్యాష్ చేసుకుంటున్న పాకిస్థాన్?
Basmati Rice Exports: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత బాస్మతీ రైతులపై కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణల కారణంగా సుమారు రూ. 50 వేల కోట్ల విలువైన భారత బాస్మతీ ఎగుమతుల రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. ఏటా దేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెట్టే ఈ రంగం, ప్రస్తుతం అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది.
ఓడరేవుల్లోనే 10 లక్షల టన్నుల నిల్వలు
యుద్ధం కారణంగా సముద్ర మార్గాలు ప్రమాదకరంగా మారడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. దీని ప్రభావంతో.. సుమారు 10 లక్షల టన్నుల బాస్మతీ బియ్యం భారత ఓడరేవుల్లోనే పేరుకుపోయింది. షిప్పింగ్ కంపెనీలు 'వార్-రిస్క్ సర్ ఛార్జ్' పేరిట అదనపు బాదుడు మొదలుపెట్టడంతో రవాణా ఖర్చులు రెట్టింపయ్యాయి. ఎగుమతిదారులపై ఈ అదనపు భారం పెను సవాలుగా మారింది.
నిలిచిపోయిన వేల కోట్ల బకాయిలు
కేవలం రవాణా మాత్రమే కాదు, చెల్లింపుల విషయంలోనూ ఎగుమతిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరాన్ వంటి దేశాల నుంచి రావాల్సిన రూ. 2,000 కోట్ల నుంచి రూ. 25,000 కోట్ల వరకు బకాయిలు నిలిచిపోయినట్లు అంచనా. అక్కడి బ్యాంకింగ్ వ్యవస్థలు అస్తవ్యస్తం కావడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్‌లో బాస్మతీ ధర క్వింటాల్‌కు రూ. 800 వరకు పడిపోయింది. దీనివల్ల పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
పాకిస్థాన్‌తో ముప్పు?
భారత్ ఎగుమతి చేసే బాస్మతీలో 70-75 శాతం వాటా సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యూఏఈ వంటి దేశాలదే. ఒకవేళ ఈ అనిశ్చితి ఇలాగే కొనసాగితే, భారత మార్కెట్‌ను పాకిస్థాన్ వంటి పొరుగు దేశాలు కైవసం చేసుకునే ప్రమాదం ఉందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఈ సంక్షోభం నుండి గట్టెక్కించాలని వారు కోరుతున్నారు.