Reliance Jio : స్టాక్ మార్కెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఐపీఓకు జియో రెడీ! అంబానీ ప్లాన్ ఇదేనా?
రిలయన్స్ జియో ఐపీఓ (IPO)కు రంగం సిద్ధమైంది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో ప్లాట్‌ఫామ్స్ ఈ వారమే సెబీకి దరఖాస్తు చేసే అవకాశం ఉంది. మెటా, గూగుల్ వంటి గ్లోబల్ ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయించబోతున్నారు. 180 బిలియన్ డాలర్ల భారీ విలువతో వస్తున్న ఈ మెగా ఐపీఓ గురించి పూర్తి వివరాలను ఈ స్టోరీలో చదవండి
Reliance Jio : స్టాక్ మార్కెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఐపీఓకు జియో రెడీ! అంబానీ ప్లాన్ ఇదేనా?
Reliance Jio : రిలయన్స్ జియో ఐపీఓ కోసం ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్లకు ఒక కీలక అప్‌డేట్ వచ్చేసింది. భారతదేశ కుబేరుడు ముఖేష్ అంబానీ తన టెలికాం దిగ్గజం 'రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్'ను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఈ వారంలోనే ముంబైలో తన ఐపీఓ కోసం అనుమతి కోరుతూ దరఖాస్తు (DRHP) దాఖలు చేసే అవకాశం ఉంది. యూజర్స్ పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికాం కంపెనీగా ఉన్న జియో, ఈ మెగా ఐపీఓ ద్వారా మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈ ఐపీఓ ప్రధానంగా ఆఫర్-ఫర్-సేల్ (OFS) పద్ధతిలో జరగనుంది. అంటే కంపెనీ కొత్త షేర్లను జారీ చేసి నిధులను సేకరించదు, బదులుగా ప్రస్తుతం ఉన్న విదేశీ పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న వాటాలో కొంత భాగాన్ని అమ్ముతారు. జియోలో పెట్టుబడులు పెట్టిన 13 మంది ప్రధాన విదేశీ ఇన్వెస్టర్లు తమ వాటాలలో సుమారు 8% వరకు విక్రయించేలా చర్చలు జరిగాయి. జియోలో మెటా (9.99%), గూగుల్ (7.73%) తో పాటు కేకేఆర్, విస్టా ఈక్విటీ పార్టనర్స్ వంటి దిగ్గజ సంస్థలకు వాటాలు ఉన్నాయి. ఈ ఇన్వెస్టర్లు తమ వాటాల్లో 8% అమ్మితే, అది జియో మొత్తం షేర్లలో 2.5% నుంచి 3% కి సమానం అవుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఐపీఓ విలువ ఎంత ఉండవచ్చంటే..
గతేడాది నవంబర్‌లో జెఫరీస్ అనే ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ అంచనా ప్రకారం జియో ప్లాట్‌ఫామ్స్ విలువ సుమారు 180 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.15 లక్షల కోట్లు). ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సుమారు 4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.33 వేల కోట్లు) నిధులు సేకరించే అవకాశం ఉందని అంచనా. ఈ భారీ ఐపీఓ ప్రక్రియను పర్యవేక్షించేందుకు రిలయన్స్ ఇప్పటికే 17 అంతర్జాతీయ, స్వదేశీ బ్యాంకులను నియమించిన విషయం తెలిసిందే. ఈ ఐపీఓ ద్వారా కేవలం పెద్ద సంస్థలకే కాకుండా, సాధారణ రిటైల్ పెట్టుబడిదారులకు కూడా లాభం చేకూరాలనేది రిలయన్స్ ఆలోచనగా తెలుస్తోంది. 2020లో విదేశీ సంస్థల నుంచి 20.5 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించిన జియో, ఇప్పుడు భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలవబోతోందని చెబుతున్నారు.