Vande Bharat Food: అది పురుగు కాదు కుంకుమ పువ్వు..వందే భారత్‌లో దారుణ స్థితి
Vande Bharat Food: ప్రీమియం ట్రైన్ గా ఇండియన్ రైల్వేస్ ప్రచారం చేసే వందే భారత్ రైలులో పురుగులతో ఉన్న పెరుగు కు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది.
Vande Bharat Food
Vande Bharat Food: వందే భారత్ ప్రీమియం ట్రైన్ గా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన ట్రైన్. టికెట్ తీసుకునే సమయంలోనే ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకునే సౌలభ్యం.. ప్రయాణీకులకు నాణ్యమైన ఆహరం అందిస్తామని హామీ ఇస్తుంది ఇండియన్ రైల్వేస్. కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. చాలా సందర్భాల్లో వందే భారత్ ట్రైన్ లో అందిస్తున్న ఫుడ్ విషయంలో ఎన్నో ఫిర్యాదులు తెరమీదకు వచ్చాయి. అయినా పరిస్థితిలో మార్పు రాలేదని తాజా ఉందంతం రుజువు చేస్తోంది. వందే భారత్ వంటి హై-స్పీడ్ రైళ్లలో ప్రయాణించడానికి ప్రజలు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు, కానీ దానికి ప్రతిఫలంగా వారికి ఏమి లభిస్తోంది? రైల్వేలోని దారుణ వాస్తవం ఒక వైరల్ వీడియోలో బయటపడింది.
రైల్వేస్ నిర్లక్ష్యం.. ప్రయాణీకుల ఆరోగ్యంతో చెలగాటం
వైరల్ అవుతున్న వీడియోలో, ఒక ప్రయాణికుడు పెరుగును చూపిస్తూ అందులో పురుగులు ఉన్నాయని పాంట్రీ మేనేజర్ కు కంప్లైంట్ చేస్తుండడం కనిపించింది. దీనికి పాంట్రీ మేనేజర్‌తో పాటు ఉన్న సిబ్బంది నవ్వుతూ, “ఇది కుంకుమపువ్వు” అని సమాధానం ఇచ్చారు. దీంతో ఆ ప్రయాణికుడు స్పష్టంగా కదులుతున్న తెల్ల పురుగులు ఉన్న మరో ప్లేటును చూపించగా, సిబ్బంది తెల్లముఖం వేశారు. దీంతో ఆగ్రహించిన ఆ ప్రయాణికుడు, “ఇది తిని నేను చనిపోతే రైల్వే బాధ్యత తీసుకుంటుందా?” అని ప్రశ్నించాడు.
రైల్వేలకు భయపడని కాంట్రాక్టర్లు..
ఈ సంఘటనకు రైల్వే బోర్డు తీసుకున్న కొత్త నిర్ణయమే కారణమని భావిస్తున్నారు. గతంలో, నాసిరకం ఆహారం అందించిన కాంట్రాక్టర్లపై భారీ జరిమానాలు విధించేవారు. కానీ ఇప్పుడు కాంట్రాక్టర్లపై జరిమానాలను తగ్గించి, వారికి 'శిక్షణ' ఇవ్వాలని రైల్వే బోర్డు ఆదేశించింది. బహుశా ఫుడ్ పాయిజనింగ్ వంటి పెద్ద సంఘటన జరిగితే తప్ప జరిమానాలు విధించని ఈ ఉదాసీన విధానం కారణంగానే ఇప్పుడు ప్యాంట్రీ సిబ్బంది అదుపుతప్పినట్లు ప్రవర్తిస్తున్నారేమో అని ఈ వీడియో చూసిన నెటిజన్లు అంటున్నారు.
సోషల్ మీడియాలో ఆగ్రహం
ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో వినియోగదారులు, "ప్రీమియం రైళ్లకే ఇలా ఉంటే, సాధారణ రైళ్ల సంగతేంటి?" అని ప్రశ్నిస్తున్నారు. ఉన్నత రైల్వే అధికారులు విచారణకు ఆదేశించినప్పటికీ, ప్రయాణికులలో విశ్వాసం సన్నగిల్లుతోంది.
రైల్వే వారి ఈ 'కుంకుమపువ్వు లేదా పురుగులు' వాదన ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడటం లాంటిది. కఠినమైన జరిమానాలు, బ్లాక్‌లిస్టింగ్ వంటి చర్యలు తీసుకునేంత వరకు, ప్రయాణికులకు ఇలాంటి 'పోషకమైన' ఆహారమే అందుతూనే ఉంటుంది అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైలులో ఇలాంటి సమస్య మీకెదురైతే ఇలా చేయండి..
రైల్‌మదాద్ యాప్ (అత్యంత ప్రభావవంతమైనది)
- యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, 'రైలు ఫిర్యాదు' విభాగానికి వెళ్లండి.
- అక్కడ, 'క్యాటరింగ్ & వెండింగ్' ఎంపికను ఎంచుకోండి.
- మీ భోజనం ఫోటోను అప్‌లోడ్ చేసి, PNR నంబర్‌తో పాటు వివరాలను రాయండి.
- మీరు వెంటనే ఒక ఫిర్యాదు సంఖ్యను (రిఫరెన్స్ నంబర్) పొందుతారు. దాని స్థితిని ట్రాక్ చేయగలుగుతారు.
139 (రైల్వే హెల్ప్ లైన్)
కస్టమర్ కేర్ ఏజెంట్‌తో మాట్లాడి క్యాటరింగ్ ఫిర్యాదును నమోదు చేయండి.
ట్విట్టర్ (X) – సోషల్ మీడియా పవర్
@RailMinIndia, @IRCTCofficial, @RailwaySeva లను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయండి.
మీ ట్వీట్‌లో మీ PNR నంబర్, రైలు నంబర్, సీటు నంబర్‌ను తప్పకుండా చేర్చండి. తరచుగా, అధికారులు తనిఖీ కోసం తదుపరి స్టేషన్‌లో వస్తారు.
ఇ-క్యాటరింగ్ వెబ్‌సైట్ (IRCTC)
మీరు ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేసినట్లయితే, IRCTC వారి ఇ-క్యాటరింగ్ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా కూడా రీఫండ్‌లు కోరవచ్చు. ఫిర్యాదులు చేయవచ్చు.