Vande Bharat : పళ్ల డాక్టర్ దగ్గరకు వెళ్లక్కర్లేదు.. వందే భారత్ ఎక్కితే చాలు, మీ దంతాల గుట్టు రట్టవుతుంది
Vande Bharat : వందే భారత్ రైలులో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ దంతాల వయస్సును తెలుసుకోండి. ఏఐ (AI) సాయంతో నిర్వహిస్తున్న ఈ వినూత్న కార్యక్రమం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Vande Bharat : వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ మీ దంతాల ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చని ఎప్పుడైనా ఊహించారా? ఇది వినడానికి వింతగా అనిపించినా ఇప్పుడు నిజమైంది. మీరు రైలులో కూర్చుని కేవలం ఒక QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా మీ దంతాల వయస్సు ఎంత? అవి ఎంత పటిష్టంగా ఉన్నాయి? అనే విషయాలను ఇట్టే తెలుసుకోవచ్చు. సాధారణంగా చాలామంది దంతాల నొప్పి భరించలేనంత వరకు డాక్టర్ దగ్గరకు వెళ్లరు. ఈ అలవాటును మార్చేందుకు భారత రైల్వేలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఈ ప్రచారం కోసం ఎంచుకున్నారు. ప్రయాణంలో ఉన్నప్పుడు మీ కళ్లెదుట కనిపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా మీ దంతాల పరిస్థితిని అంచనా వేయవచ్చు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ ప్రశంసించారు. "ఆరోగ్యమే మహాభాగ్యం.. ప్రజలు తమ దంతాల వయస్సును తెలుసుకోవడం ద్వారా వాటిని మరింత జాగ్రత్తగా కాపాడుకుంటారు" అని ఆమె పేర్కొన్నారు.
ఈ వినూత్న పద్ధతిలో మీ దంతాల వయస్సును తెలుసుకోవడం చాలా సులభం. మీరు చేయాల్సిందల్లా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం మాత్రమే. వెంటనే ఒక విండో ఓపెన్ అవుతుంది, అందులో మీ దంతాలకు సంబంధించిన ఒక ఫోటోను అప్‌లోడ్ చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సహాయంతో కేవలం ఐదు సెకన్లలో మీ దంతాల నివేదిక మీ ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దంతాల సెన్సిటివిటీ (జివ్వుమనడం), చిగుళ్ల సమస్యలు వంటి వాటిని ఇది గుర్తిస్తుంది. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ (IDA) సహకారంతో ఈ టెక్నాలజీని రూపొందించారు.
హెలియన్ ఇండియా సీఈఓ కేదార్ లెలే మాట్లాడుతూ.. భారతదేశంలో పది మందిలో తొమ్మిది మంది ఏదో ఒక రకమైన నోటి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. అభివృద్ధి చెందిన భారత్ వైపు మనం అడుగులు వేయాలంటే ముందుగా నివారణ ఆరోగ్య సంరక్షణను అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. చాలామందికి చిగుళ్ల సమస్యలు ఉన్నాయని, కానీ నొప్పి వచ్చే వరకు వాటిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ డెంటల్ ఏజ్ ఇండెక్స్ ద్వారా ప్రజలు ఎక్కడి నుంచైనా తమ ఆరోగ్యాన్ని చెక్ చేసుకునే సదుపాయం కల్పించామని వివరించారు.