Defense Exports : చరిత్ర సృష్టించిన ఆత్మనిర్భర్ భారత్.. 38,424 కోట్లతో ప్రపంచాన్ని శాసిస్తున్న ఇండియా

Defense Exports : భారత రక్షణ ఎగుమతులు 2025-26లో రూ.38,424 కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 62.66% వృద్ధి నమోదైంది. బ్రహ్మోస్ మిసైల్స్, పినాక రాకెట్లు వంటి అత్యాధునిక ఆయుధాలను భారత్ 80కి పైగా దేశాలకు విక్రయిస్తోంది.

Update: 2026-04-04 04:15 GMT

Defense Exports

Defense Exports : భారతదేశం రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు ఆయుధాల దిగుమతికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న మన దేశం, ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఆయుధాలను విక్రయించే స్థాయికి ఎదిగింది. మేక్ ఇన్ ఇండియా నినాదం కేవలం మాటలకే పరిమితం కాకుండా, భారీ ఎగుమతుల రూపంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి రక్షణ ఎగుమతులను నమోదు చేసింది. భారత రక్షణ శాఖ సమాచారం ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం రూ.38,424 కోట్ల విలువైన రక్షణ పరికరాలను ఎగుమతి చేసింది. 2024-25లో ఈ విలువ రూ.23,622 కోట్లుగా ఉండగా, కేవలం ఒక్క ఏడాదిలోనే 62.66 శాతం వృద్ధి సాధించడం విశేషం. ఈ అద్భుతమైన మార్పునకు ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు రెండూ కీలక పాత్ర పోషించాయి. ప్రభుత్వ రంగ సంస్థల ఎగుమతులు ఏకంగా 151 శాతం పెరిగి రూ. 21,071 కోట్లకు చేరగా, ప్రైవేట్ రంగం రూ. 17,353 కోట్ల వాటాను అందించింది.

భారత్ నుంచి ప్రపంచ దేశాలు ఏం కొంటున్నాయి?

ఒకప్పుడు కేవలం చిన్నపాటి తుపాకులు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు మాత్రమే ఎగుమతి చేసిన భారత్, ఇప్పుడు అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణులను కూడా విక్రయిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైళ్లు, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వీటితో పాటు పినాక రాకెట్ లాంచర్లు, ఎటాగ్స్ హోవిట్జర్ ఫిరంగులు, స్వాతి రాడార్లు, అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్ ను భారత్ భారీగా ఎగుమతి చేస్తోంది. సముద్ర రంగంలో డోర్నియర్-228 విమానాలు, స్పెషల్ బోట్లు, తేలికపాటి టార్పెడోలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

కొనుగోలు చేస్తున్న ప్రధాన దేశాలు ఇవే..

భారత రక్షణ ఉత్పత్తులను ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాలు వాడుతున్నాయి. అత్యంత ఆశ్చర్యకరంగా, అగ్రరాజ్యం అమెరికా కూడా భారత్ నుంచి యుద్ధ విమానాల విడిభాగాలు, సబ్-సిస్టమ్స్ ను దిగుమతి చేసుకుంటోంది. ఫ్రాన్స్, ఆర్మేనియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా వంటి దేశాలు మన ప్రధాన కస్టమర్లుగా మారాయి. వీటితో పాటు ఈజిప్ట్, ఇజ్రాయెల్, శ్రీలంక, జర్మనీ, బెల్జియం, అనేక ఆఫ్రికన్ దేశాలు భారత ఆయుధాలపై నమ్మకం ఉంచుతున్నాయి. ప్రస్తుతం దేశంలో రిజిస్టర్డ్ రక్షణ ఎగుమతిదారుల సంఖ్య కూడా 145కి పెరగడం గమనార్హం.

మేక్ ఇన్ ఇండియా సక్సెస్ మంత్రం

గత ఐదేళ్లలో భారత రక్షణ ఎగుమతులు దాదాపు మూడు రెట్లు పెరగడం గమనార్హం. కేవలం విదేశీ ఆయుధాలను కొనడమే కాకుండా, మనమే స్వయంగా తయారు చేసి ప్రపంచానికి విక్రయించాలన్న ప్రధానమంత్రి మోదీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం ఇప్పుడు సాకారమవుతోంది. తక్కువ ధర, అత్యాధునిక సాంకేతికత, నమ్మకమైన పనితీరు కారణంగా భారతీయ ఆయుధాలకు గ్లోబల్ మార్కెట్లో తిరుగులేని గుర్తింపు లభిస్తోంది. రానున్న రోజుల్లో భారత్ ప్రపంచంలోని టాప్ 5 రక్షణ ఎగుమతిదారులలో ఒకటిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News