Indian Army : హిమాలయ శిఖరాల పైన మోనోరైల్.. చైనా, పాక్ సరిహద్దుల్లో ఇక భారత్ ఆధిపత్యం
Indian Army : భారత సైన్యం సరిహద్దుల్లో శత్రువులకే కాదు.. ప్రకృతి సవాళ్లకు కూడా గట్టి సమాధానం చెబుతోంది. అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతాల్లో, మైనస్ డిగ్రీల చలిలో విధులు నిర్వర్తించే సైనికులకు అవసరమైన సరుకులు, ఆయుధాలను చేరవేయడం ఇకపై చిటికెలో పనికానుంది. దీనికోసం భారత ఆర్మీ స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఒక అద్భుతమైన మోనోరైల్ రవాణా వ్యవస్థను ప్రవేశపెట్టింది.
Indian Army Monorail
Indian Army : భారతదేశ సరిహద్దుల్లో, ముఖ్యంగా హిమాలయ పర్వత శ్రేణుల్లో రవాణా అనేది ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. మనుషులు నడవలేని, వాహనాలు వెళ్లలేని చోట్ల సైనికులకు ఆహారం, మందుగుండు సామగ్రి అందించడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ సమస్యకు పరిష్కారంగా భారత సైన్యం హై ఆల్టిట్యూడ్ మోనోరైల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ను రంగంలోకి దించింది. సముద్ర మట్టానికి సుమారు 16,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఇది విజయవంతంగా పనిచేస్తోంది. ఈ అద్భుతమైన ఫీట్ సాధించినందుకు గాను ఈ సిస్టమ్‌కు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అధికారిక గుర్తింపు లభించింది.
24 గంటల సేవలు
ఈ మోనోరైల్ వ్యవస్థ గత నాలుగు నెలలుగా ఏకధాటిగా సేవలందిస్తోంది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు, భీకరమైన మంచు తుఫానులు, ఆక్సిజన్ తక్కువగా ఉండే కఠినమైన వాతావరణంలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తోందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. పగలు, రాత్రి తేడా లేకుండా అడ్డంకులు లేని సప్లై చైన్‌ను ఇది నిర్ధారిస్తోంది. దీనివల్ల పర్వత శిఖరాల మీద ఉండే అగ్రగామి పోస్టుల వద్ద ఉన్న సైనికులకు అవసరమైన రవాణా మద్దతు ఎప్పుడూ అందుబాటులో ఉంటోంది.
ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరో ముందడుగు
ఈ మోనోరైల్ వ్యవస్థ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారవ్వడం గర్వకారణం. విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా మన ఇంజనీర్లు రూపొందించిన ఈ వ్యవస్థ మేక్ ఇన్ ఇండియా విజయానికి నిలువుటద్దంలా నిలుస్తోంది. రక్షణ రంగంలోనే కాకుండా, భవిష్యత్తులో సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, రహదారుల నిర్మాణానికి కూడా ఈ సాంకేతికత ఎంతో ఉపయోగపడనుంది. సాధారణ రవాణా మార్గాల్లో కంటే వేగంగా, తక్కువ ఖర్చుతో సరుకులను చేరవేసే ఈ మోనోరైల్, సైన్యం ఆపరేషనల్ సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది.
భవిష్యత్తులో గేమ్ చేంజర్‌గా..
ఈ ప్రయోగాత్మక ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడంతో, మరిన్ని సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఇటువంటి మోనోరైల్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఆర్మీ యోచిస్తోంది. దీనివల్ల హెలికాప్టర్ల వినియోగం, భారీ ఖర్చుతో కూడిన ఇతర రవాణా మార్గాలపై భారం తగ్గుతుంది. అంతేకాకుండా, యుద్ధం వంటి అత్యవసర సమయాల్లో భారీ ఆయుధాలను ఎత్తైన శిఖరాలకు చేరవేయడానికి ఇది ఒక అస్త్రంలా పనిచేయనుంది. భారత సరిహద్దులను కాపాడే వీర జవాన్లకు ఈ మోనోరైల్ ఒక గొప్ప తోడుగా మారింది.