Annamalai: బీజేపీ లిస్ట్‌లో అన్నామలై పేరు ఎందుకు లేదు? అసలు కారణం ఇదే!
Annamalai: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై అన్నామలై కీలక వ్యాఖ్యలు. బీజేపీ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడానికి గల కారణం వెల్లడి.
Annamalai: బీజేపీ లిస్ట్‌లో అన్నామలై పేరు ఎందుకు లేదు? అసలు కారణం ఇదే!
Annamalai: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కుతున్న వేళ, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై తన పోటీపై నెలకొన్న సందిగ్ధతను తొలగించారు. బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో.. పార్టీ ఆయనను దూరం పెట్టిందని, లేదా ఆయనే అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరిగింది. దీనిపై చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడిన అన్నామలై, అసలు నిజాన్ని వెల్లడించారు.
కోర్ కమిటీకి ముందే చెప్పాను:
"ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయకూడదని స్వయంగా నిర్ణయించుకున్నాను. ఏ నియోజకవర్గం నుంచి కూడా నేను బరిలో ఉండనని పార్టీ కోర్ కమిటీకి ముందే రాతపూర్వకంగా తెలియజేశాను. నేను పోటీ చేయనని చెప్పినప్పుడు పార్టీ నాయకత్వం నాకు టికెట్ ఎలా ఇస్తుంది?" అని అన్నామలై స్పష్టం చేశారు. ఒక నియోజకవర్గానికి పరిమితం అవ్వడం కంటే, రాష్ట్రవ్యాప్తంగా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఎన్డీఏ అభ్యర్థుల కోసం ప్రచారం:
తను పోటీలో లేకపోయినప్పటికీ, ఎన్డీఏ (NDA) అభ్యర్థుల తరపున పూర్తిస్థాయిలో ప్రచార బరిలోకి దిగుతానని అన్నామలై ప్రకటించారు. తన నిర్ణయాన్ని గౌరవించినందుకు బీజేపీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. కూటమి భాగస్వామ్య పక్షాల అభ్యర్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించే అవకాశం దక్కడం సంతోషంగా ఉందని ఆయన వెల్లడించారు.
ఊహాగానాలకు ముగింపు:
అన్నామలై వ్యాఖ్యలతో గత కొద్దిరోజులుగా జరుగుతున్న రాజకీయ ప్రచారానికి తెరపడింది. తాను ఎక్కడి నుంచైనా పోటీ చేయగలనని, అయితే పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నానని ఆయన నొక్కి చెప్పారు. తమిళనాడులో బీజేపీ పట్టు పెంచేందుకు ఆయన వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.