Narsapur: చెప్పకుండా వెళ్లిపోయిన హాస్టల్ నిర్వాహకురాలు 120 మంది విద్యార్థుల రోడ్డున
Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ప్రైవేట్ హాస్టల్ నిర్వాహకురాలు పరార్. 120 మంది విద్యార్థుల ఆందోళన, 30 లక్షల అప్పులు ఉన్నట్లు ప్రచారం.
Narsapur: చెప్పకుండా వెళ్లిపోయిన హాస్టల్ నిర్వాహకురాలు 120 మంది విద్యార్థుల రోడ్డున
Narsapur: నర్సాపూర్ పట్టణంలోని తుప్రాన్ రోడ్డులో గల శ్రీ వెంకటేశ్వర కాలనీలో ప్రైవేట్ హాస్టల్ నిర్వహిస్తున్న సాయి మణి అనే మహిళ గత మూడు రోజులుగా విద్యార్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయినట్లు విద్యార్థులు చెబుతున్నారు. దీంతో హాస్టల్‌లో ఉంటున్న సుమారు 120 మంది విద్యార్థులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.
విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయి మణి కాలనీలో ఇళ్లను అద్దెకు తీసుకుని అమ్మాయిలకు, అబ్బాయిలకు వేర్వేరుగా హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఈ హాస్టల్‌లో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇంటర్, డిగ్రీ తదితర కోర్సులు చదువుతున్న సుమారు 120 మంది విద్యార్థులు ఉంటున్నారు.
హాస్టల్‌లో చేరే సమయంలో విద్యార్థులు రెండు నుంచి నాలుగు నెలలకు సంబంధించిన ఫీజును అడ్వాన్స్‌గా చెల్లించినట్లు చెబుతున్నారు. అయితే గత మూడు రోజులుగా హాస్టల్ నిర్వాహకురాలు అకస్మాత్తుగా అందుబాటులో లేకుండా వెళ్లిపోవడంతో విద్యార్థులకు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.
హాస్టల్‌లో భోజనం, ఇతర వసతి సౌకర్యాలు నిలిచిపోవడంతో గత మూడు రోజులుగా బయట హోటళ్లలో భోజనం చేస్తూ ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు రూ.30 లక్షల అప్పులు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా హాస్టల్ నిర్వాహకురాలికి ఇల్లు అద్దెకు ఇచ్చిన యజమానికి సుమారు రూ.12 లక్షల వరకు అద్దె బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కిరాణా షాపు నిర్వాహకులకు కూడా 8 లక్షల వరకు బకాయిలు ఉన్నట్లు, అలాగే పలువురు ప్రైవేట్ ఫైనాన్స్ నిర్వాహకుల వద్ద కూడా భారీగా లక్షల్లో అప్పులు చేసినట్లు సమాచారం.
విద్యార్థుల వివరాల ప్రకారం.. ఇల్లు అద్దె, కిరాణా సరుకుల బకాయిలు, ప్రైవేట్ ఫైనాన్స్‌ల అప్పులు తదితరాలు కలిపి మొత్తం దాదాపు రూ.30 లక్షల వరకు అప్పులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అప్పులు, బకాయిలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. ఎటు వెళ్లాలో తెలియక విద్యార్థుల అవస్థలు.
హాస్టల్ నిర్వాహకురాలు వెళ్లిపోవడంతో తాము ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని విద్యార్థులు వాపోతున్నారు. సొంత ఇళ్లకు వెళ్లిపోతే కళాశాలకు హాజరుకావడం కుదరదని, హాస్టల్‌లో ఉంటే భోజనం, వసతి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.
ఇప్పటికే మూడు రోజులుగా బయట హోటళ్లలో భోజనం చేస్తూ అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని, ఇలా ఇంకా ఎన్ని రోజులు అవస్థలు పడాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ముందుగానే హాస్టల్ ఫీజులు, అడ్వాన్స్‌లు చెల్లించామని, ఇప్పుడు నిర్వాహకురాలు అందుబాటులో లేకపోవడంతో తమ డబ్బులు, వసతి పరిస్థితిపై ఆందోళన నెలకొందని విద్యార్థులు తెలిపారు. అధికారుల జోక్యానికి విద్యార్థుల విజ్ఞప్తి.
ఈ వ్యవహారంపై పోలీసులు, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు. హాస్టల్ నిర్వాహకురాలు ఎక్కడ ఉన్నారో గుర్తించి, తమ సమస్యకు పరిష్కారం చూపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తమ చదువులు మధ్యలో ఆగిపోకుండా తక్షణమే ప్రత్యామ్నాయ వసతి, భోజన సౌకర్యం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తాము చెల్లించిన అడ్వాన్స్‌లు, హాస్టల్‌కు సంబంధించిన ఇతర ఆర్థిక వ్యవహారాలపై కూడా విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.
“మూడు రోజులుగా తినడానికి కూడా ఇబ్బందులు పడుతున్నాం.. ఎటు వెళ్లాలో తెలియడం లేదు..అలాగే ఇంటి నుండి తెచ్చుకొన్న డబ్బులు అయిపోయి కష్టాల పాలయ్యారు విద్యార్థులు.సొంత ఇళ్లకు వెళ్తే కళాశాలకు వెళ్లలేం. మా చదువులు నష్టపోకుండా అధికారులు వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలి” అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వాస్తవాలను వెలికితీసి, విద్యార్థుల సమస్యకు తక్షణ పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది.